: కీళ్లవాపుకు కొత్తమందు
కీళ్లవాపును తగ్గించడానికి బోలెడు మందులను వాడుతుంటాం. ఎముక, మృదులాస్థి క్షీణత వల్ల కీళ్లవాపు సంభవిస్తుంది. ఇలాంటి సమస్యలనుండి ఉపశమనాన్ని కలిగించే కొత్త మందును శాస్త్రవేత్తలు తయారుచేశారు. ఈ మందును ఎలుకలపై ప్రయోగించగా వాటిలో కీళ్లవాపు లక్షణాలు దాదాపుగా ఎనిమిది రోజుల్లోనే తగ్గిపోయాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
ఫ్లోరిడాలోని ద స్క్రిప్స్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (టీఎస్‌ఆర్‌ఐ)కు చెందిన శాస్త్రవేత్తలు కీళ్లవాపును తగ్గించే ఒక సరికొత్త రసాయనాన్ని తయారుచేశారు. తాము కనుగొన్న ఈ రసాయనం తీవ్రమైన కీళ్లనొప్పిని కలిగించే రుమటాయిడ్ ఆర్థ్రరైటిస్ సమస్యకు నోటిద్వారా తీసుకునే మందుల రూపకల్పనకు దారితీయగలదని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఎస్‌ఆర్2211గా పిలిచే ఈ రసాయనాన్ని ఎలుకలకు ఇవ్వగా వాటిలో ఎనిమిది రోజుల్లోనే కీళ్లవాపుకు సంబంధించిన లక్షణాలన్నీ కూడా దాదాపుగా తగ్గిపోయినట్టు శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
ఎముక, మృదులాస్థి క్షీణత కూడా గణనీయంగా తగ్గినట్టు వారు తెలిపారు. ఈ మందు రోగనిరోధక వ్యవస్థలో కీలక పాత్ర పోషించే టీహెచ్17 తెల్ల రక్తకణాలను నియంత్రించే రోరీ గ్రాహకాన్ని లక్ష్యంగా చేసుకుని పనిచేస్తుంది. రోగనిరోధక వ్యవస్థ మనపైన పొరబాటున దాడిచేయడం వల్ల మల్టిపుల్ స్కైరోసిస్, రుమటాయిడ్ ఆర్థ్రరైటిస్, ఐబీడీ, ల్యూపస్ వంటి సమస్యల్లో టీహెచ్17 కణాలు పాలుపంచుకుంటున్నట్టు గతంలో శాస్త్రవేత్తలు గుర్తించారు. ఎస్‌ఆర్2211 మందును గురించి టీఎస్‌ఆర్‌ఐకి చెందిన పాట్రిక్ ఆర్.గ్రిఫిన్ మాట్లాడుతూ జంతువులపై చేసిన అధ్యయనంలో ఈ మందు మంచి ఫలితాన్ని కనబరిచిందని తెలిపారు.