: డిగ్గీ రాజా పర్యటన ఆంతర్యం ... సీమాంధ్రుల చేతితోనే వారి కన్నుపొడవగలరా?
ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జ్ డిగ్గీరాజా టీం అకస్మాత్తుగా రాజధానికి రానున్న వెనుక కారణాలు ఏంటి? కాంగ్రెస్ పార్టీ మీద సీమాంధ్ర ప్రాంతానికి చెందిన నేతలంతా గుర్రుగా ఉన్న సమయంలో, మధ్యప్రదేశ్ లో చేతులు కాల్చుకుని ఎందుకూ కొరగాకుండా పోయాడని విమర్శలు ఎదుర్కొంటున్న దిగ్విజయ్ సింగ్ రాష్ట్ర వ్యవహారాలను చక్కదిద్దేస్తారా?
కేంద్రంలో కాంగ్రెస్ పార్టీపై ఆగ్రహంతో, తమ మాటను లెక్కచేయలేదన్న అక్కసుతో, పార్లమెంటులో అవిశ్వాస తీర్మానానికి నోటీస్ ఇచ్చిన ఆరుగురు ఎంపీలను కాంగ్రెస్ పార్టీ నుంచి సాగనంపుతారని స్టేట్ మెంట్ ఇచ్చిన దిగ్విజయ్ సింగ్... సీమాంధ్ర ఎమ్మెల్యేలను, సీఎంను సముదాయించడానికి తన బృందంతో రంగంలోకి దిగుతున్నారు. తెలంగాణపై తమ అభ్యంతరాలను సీమాంధ్రులు ఆంటోనీ కమిటీకి చెప్పుకోవాలంటూ సుద్దులు చెప్పిన దిగ్విజయ్... ఆ కమిటీ కథేంటో తేల్చలేదు. తరువాత జీవోఎంకు చెప్పుకోండి, అవకాశం ఉంది కదా? అని చెప్పిన దిగ్విజయ్ సూచనపై కొండంత ఆశతో వెళ్లిన సీమాంధ్రులకు షాకిచ్చింది జీవోఎం. తరువాత మేడంతో చెప్పుకుందాం అంటూ వెళ్లిన సీమాంధ్రులకు కనీసం అపాయింట్ మెంట్ కూడా లభించని దుస్థితి ఎదురైంది.
దీంతో తీవ్ర మనస్తాపం చెందిన సీమాంధ్ర ప్రజాప్రతినిధులు అవిశ్వాస తీర్మానానికి నోటీసిచ్చారు. అవిశ్వాసం నెగ్గుతుందా? ఓడుతుందా? అన్నది ప్రక్కన పెడితే, పార్టీ బహిష్కరించినా తాము చిత్తశుద్ధితో సమైక్యాంధ్రకు పాటుపడుతున్నామనే సందేశాన్ని తమతమ నియోజకవర్గాల ప్రజలకు సీమాంధ్ర ఎంపీలు పంపించారు.
ఎంపీల నిర్ణయానికి సీమాంధ్ర ఎమ్మెల్యేలంతా పార్టీలకతీతంగా మద్దతు పలుకుతున్నారు. ఈ నేపథ్యంలో డిగ్గీ రాజా సీమాంధ్ర ఎంపీలను పార్టీ నుంచి బహిష్కరించి.. ఎమ్మెల్యేలను ఒప్పించి తెలంగాణ బిల్లును శాసనసభలో గెలిపించగలరా? అని విశ్లేషకులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. సీమాంధ్రుల వేలితోనే వారి కన్ను పొడవగలరా? అని సందేహపడుతున్నారు.