: అవిశ్వాస తీర్మానం నెగ్గాలని సీఎం కోరుకుంటున్నారు: గంటా శ్రీనివాసరావు
పార్లమెంటులో యూపీఏ ప్రభుత్వంపై సీమాంధ్ర ఎంపీలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గాలని సీఎం కిరణ్ కుమార్ రెడ్డి కోరుకుంటున్నారని మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. విశాఖలో ఆయన మాట్లాడుతూ, సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీ ఏ మాత్రమైనా బతికి ఉందంటే అది కిరణ్ కుమార్ రెడ్డి చలవేనని అన్నారు. కాంగ్రెస్ పని అయిపోయినట్టేనని ఆయన స్పష్టం చేశారు.
తానేం చెప్పానో అదే చేస్తానని.. ప్రజలు, స్థానిక రాజకీయ నాయకులు ఏమనుకున్నా తనకు సంబంధంలేదన్నట్టు కాంగ్రెస్ అధిష్ఠానం మూర్ఖంగా ప్రవర్తిస్తోందని ధ్వజమెత్తారు. దిగ్విజయ్ సింగ్ ప్రభుత్వ మాట చెబుతుంటే, షిండే పార్టీ మాట చెబుతున్నారని విమర్శించారు. విభజనపై అప్రజాస్వామ్యంగా వ్యవహరించిన కేంద్రంపై ఏ చర్యకైనా వెనుకాడమని గంటా అన్నారు. విభజన విషయంలో ఎమ్మెల్యేలంతా ఏకతాటిపై నిలవాలని కోరారు. అధిష్ఠానం మాటకే కట్టుబడి ఉంటామంటూ కొందరు చేస్తున్న వ్యాఖ్యలను విమర్శిస్తూ, 'ప్రజల గొంతు కోయొద్దని' ఆయన వారికి విజ్ఞప్తి చేశారు.