: రాష్ట్రపతి తక్కువ సమయం ఇస్తే రాష్ట్ర ప్రభుత్వాన్ని పడగొడతాం: టీజీ వెంకటేష్
తెలంగాణ ముసాయిదా బిల్లుపై చర్చకు రాష్ట్రపతి 45 రోజుల సమయం ఇస్తారని, అనంతరం సీఎం మరో 20 రోజుల సమయం అడుగుతారని రాష్ట్ర మంత్రి టీజీ వెంకటేష్ స్పష్టం చేశారు. ఒక వేళ రాష్ట్రపతి తక్కువ సమయం ఇస్తే... రాష్ట్ర ప్రభుత్వాన్ని పడగొట్టే ప్రయత్నం చేస్తామని అన్నారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడారు. అన్నీ సవ్యంగా జరిగితే 65 రోజుల తర్వాత, విభజనను అడ్డుకోవడానికి ఎలాంటి స్పీడ్ బ్రేకర్లు వేయాలో అన్నీ వేస్తామని... అవసరమైనన్ని గుంతలు తవ్వుతామని తెలిపారు. ఇప్పటివరకైతే విభజన ప్రక్రియ వేగంగా కదలకుండా తామంతా పూర్తిగా సక్సెస్ అయ్యామని అన్నారు. ప్రస్తుతం పార్టీ అధిష్ఠానంతో అంతర్గతంగా విబేధిస్తున్నామని... పార్టీలో స్వాతంత్ర్యం ఉన్నంత వరకు కొనసాగుతామని తెలిపారు. కిరణ్ కొత్త పార్టీ గురించి మీడియా ప్రశ్నించగా... ఏదైనా సాధ్యమే, కన్నతల్లి లాంటి ప్రాంతానికి నష్టం జరుగుతున్నప్పుడు ఏదైనా చేసే అవకాశం ఉంటుందని అభిప్రాయపడ్డారు.