: తన పక్కనున్న అమ్మ చనిపోయిందని ఆ చిన్నారికేం తెలుసు?


తల్లి ప్రక్కనే రాత్రంతా బాలుడు ఆదమరచి నిద్రపోయాడు.. ఉదయాన్నే ఎప్పట్లా తనను నిద్రలేపే అమ్మ ఎంతకీ నిద్రలేవకపోవడంతో తట్టి లేపాడు. ఆమె నుంచి స్పందన లేకపోవడంతో.. అమ్మ లేవడం లేదంటూ ఏడుస్తూ ఇంటి బయటకు వచ్చాడు. దీంతో ఆమె హత్య విషయం వెలుగుచూసింది. హైదరాబాద్ బోయినపల్లిలో ఈ అమానుష ఘటన జరిగింది.

వివరాల్లోకి వెళితే.. మెదక్ జిల్లా రాళ్ల బండి గ్రామానికి చెందిన నాగమణి(32)కి పదేళ్ల వయసులోనే పెళ్లైంది. తరువాత కుటుంబ కలహాల వల్ల భర్తతో విడిపోయి బతుకు తెరువుకు హైదరబాద్ లోని ఓ ఇంట్లో పని చేస్తోంది. అదే ఇంట్లో మరమ్మతుల పనుల కోసం వచ్చిన అశోక్ తో నాగమణికి పరిచయం ఏర్పడి, అది ప్రేమకు దారితీసి, నాలుగేళ్ల క్రితం పెళ్లి చేసుకున్నారు. వీరికి మూడేళ్ల బాబు ఉన్నాడు. అశోక్ కి అప్పటికే పెళ్లవడంతో నాగమణిని బోయినపల్లిలోని కంసారి బజార్ లోని ఓ ఇంట్లో ఉంచాడు.

విషయం ఆ నోటా, ఈ నోటా నాని మొదటి భార్యకు తెలిసింది. దీంతో ఆమె కుటుంబాన్ని సరిదిద్దుకునేందుకు గొడవపడింది. దీంతో అశోక్, నాగమణి మధ్య కూడా వివాదం మొదలైంది. పెళ్లి టైంలో నాగమణికి ఫ్లాట్, కొంత పొలం కొనిస్తానని మభ్యపెట్టిన అశోక్ తో గత రాత్రి గొడవ జరిగింది. ఈ నేపథ్యంలోనే అశోక్ హత్యకు పాల్పడినట్టు స్థానికులు అనుమానిస్తున్నారు. వీరి అనుమానాలకు బలం చేకూరుస్తూ అశోక్ పరారీలో ఉన్నాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

  • Loading...

More Telugu News