: విమాన ప్రయాణీకులకూ ఈ-టికెట్!
విమానాశ్రయాలలో టికెట్ చెకింగ్ కోసం నిమిషాల తరబడి క్యూలలో వేచి ఉండే బాధ త్వరలో దేశీయ ప్రయాణికులకు తప్పనుంది. వీరి సౌలభ్యం కోసం మొబైల్ ఫోన్లోనే ఈ టికెట్, బోర్డింగ్ పాస్ సదుపాయం అందుబాటులోకి తీసుకురావాలని పౌరవిమానయాన శాఖ యోచిస్తోంది. బార్ కోడింగ్ కార్డులను ఫోన్లోనే అందుకునే విధంగా తగిన ప్రొటోకాల్ ను రూపొందించాలని పౌరవిమానయాన శాఖ బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ విభాగాన్ని కోరింది. సాధ్యమైనంత త్వరలో దీన్ని అమల్లోకి తేవాలనుకుంటున్నామని ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. ఇది అమల్లోకి వస్తే టికెట్ చూపించి దానిపై సీఐఎస్ఎఫ్ అధికారులు ఆమోద ముద్ర వేయించుకునే పని లేకుండా మొబైళ్లలోని ఈ టికెట్ చూపించి ముందుకు సాగిపోవచ్చు.
మరోవైపు విలువైన సమయాన్ని హరిస్తున్న బ్యాగేజీ స్టాంపింగ్ విధానాన్ని సమీక్షించాలని పలు విమానాశ్రయాలు కేంద్రాన్ని కోరాయి. సాధారణంగా ప్రతీ ప్రయాణికుడి లగేజీ బ్యాగులను తనిఖీ చేసి వాటికి ట్యాగ్ తగిలించి అధికారులు స్టాంప్ వేస్తుంటారు. ఒక్కోసారి ఈ స్టాంప్ పడకపోతే ప్రయాణికులు మళ్లీ వెనక్కి వచ్చి వేయించుకోవాల్సి వస్తోంది. ఈ అనుభవాల నేపథ్యంలో ఈ విధానాన్ని మార్చాలని పలు విమానాశ్రయ నిర్వహణ సంస్థలు కేంద్ర ప్రభుత్వానికి కోరుతున్నాయి.