: ఇలాంటి సమయస్ఫూర్తి అందరికీ రావాలి
సమయస్ఫూర్తి... సమయానికి తగు విధంగా స్పందించడం. ఇది వున్నవారు ఎలాంటి ప్రమాదం నుండైనా సులభంగా బయటపడగలరు. అంతేకాదు... ఎలాంటి సమస్యలు వచ్చినా కూడా వారు తమ సమయస్ఫూర్తితో ఇట్టే సమస్యలను అధిగమించేస్తారు. ఇలాంటి సమయస్ఫూర్తితో తాను బయటపడడమేకాదు... తన తోటివారిని కూడా రక్షించింది ఒక పధ్నాలుగేళ్ల బాలిక.
అస్సాంలోని శివసాగర్ జిల్లా శిమలుగురికి చెందిన నజిర కేంద్రీయ విద్యాలయానికి చెందిన స్కూలు బస్సు పాఠశాల నుండి ఇంటికి పిల్లలతో వెళుతున్న సమయంలో ఒక కిడ్నాపర్ బస్సులోకి ఎక్కి బస్సును అడవిలోకి మళ్లించాడు. కానీ డ్రైవర్ సమయస్ఫూర్తితో బస్సును తేయాకు తోటల్లోని ఒక కాలువలోకి దించేశాడు. దీంతో సదరు కిడ్నాపరు ఒక అమ్మాయి చేయిపట్టుకుని ఈడ్చుకెళ్లడానికి ప్రయత్నించగా, ఆ అమ్మాయి ఏడుపు లంకించుకుంది. దీంతో గుంజన్ అనే పద్నాలుగేళ్ల బాలిక ధైర్యంగా ముందుకొచ్చి తనను తీసుకెళ్లాల్సిందిగా కిడ్నాపర్‌ను కోరింది.
దీంతో కిడ్నాపర్ గుంజన్‌ను చేయిపట్టుకుని తీసుకెళ్లసాగాడు. అడవిలో కొంతదూరం వెళ్లిన తర్వాత గుంజన్ కిడ్నాపర్ నుండి తప్పించుకుని దగ్గరలోని ఒక తేయాకుతోట కార్మికుడి ఇంటికి చేరుకుంది. అక్కడినుండి పోలీసులకు ఫోన్‌చేసి పరిస్థితిని వివరించింది. వెంటనే పోలీసులు వచ్చి పిల్లల్ని రక్షించారు.
ఇంతటి సాహసాన్ని, సమయస్ఫూర్తిని ప్రదర్శించిన గుంజన్‌ను అస్సాం ముఖ్యమంత్రి తరుణ్ గొగోయ్ మెచ్చుకుంటూ ఇలాంటి సాహసం, తెగువ మరింత మంది బాలికలను స్ఫూర్తినివ్వాలనే ఉద్దేశ్యంతో ఆయన గుంజన్‌కు రెండు లక్షల రూపాయల రివార్డును ప్రకటించారు. అంతేకాదు... ఆమె పేరును జాతీయ సాహస బాలల అవార్డుకు కూడా సిఫారసు చేయాల్సిందిగా అధికారులను పురమాయించాడు. ఇటు విద్యాశాఖ కూడా గుంజన్‌కు పాతికవేలు, తెలివిగా కాలువలోకి బస్సును దించిన డ్రైవర్‌కు పదివేలను రివార్డుగా అందించింది. అందుకే సమయస్ఫూర్తి, ధైర్యం ఉంటే ఎలాంటి ప్రమాదం నుండైనా బయటపడవచ్చు.