: సికింద్రాబాద్ స్టేషన్ లో సైకో చేతిలో హత్యకు గురైన ఆరేళ్ల చిన్నారి
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ఇవాళ దారుణ ఘటన జరిగింది. 10వ నెంబరు ఫ్లాట్ ఫారమ్ పై ఆరేళ్ల చిన్నారిపై ఓ సైకో కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో అభం శుభం తెలియని ఆ చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. బంధువుల వివాహానికి వెళ్లేందుకు తండ్రి, నానమ్మతో కలిసి వచ్చిన ఆరేళ్ల ప్రియదర్శినిపై ఆగంతుకుడు కత్తితో దాడి చేశాడు. ఆ చిన్నారిని విచక్షణా రహితంగా కత్తితో పొడిచాడు. ఈ హఠాత్పరిణామంతో ప్రయాణికులు ఉలిక్కి పడ్డారు. వెంటనే అతడిని పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు.
నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అతని వద్ద ఉన్న రెండు కత్తులను స్వాధీనం చేసుకొన్నారు. చికిత్స నిమిత్తం ప్రియదర్శినిని గాంధీ ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచింది. బాధితురాలు ముషీరాబాద్ గంగపుత్ర కాలనీ వాసులు శ్రీనివాస్, సోనూ దంపతుల కుమార్తె అని పోలీసులు తెలిపారు. చిన్నారి మృతితో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.