: ఈ కళ్లజోడు భలే...
కళ్లజోడు ఎలా ఉపయోగపడుతుంది... కళ్లలో దుమ్ము పడకుండాను, ఎక్కువ వెలుతురు నుండి కళ్లను రక్షించడానికి, ఇంకా కంటిచూపు సరిగాలేనివారికి చక్కగా కనిపించేలా చేయడానికి... ఇలా పలు రకాలుగా మనం కళ్ళజోడును వాడుతాం. అయితే కంటిచూపుకు సంబంధించిన వ్యాధితో బాధపడేవారికి వారు ధరించిన కళ్లజోడే వారి కళ్లలో మందు వేసేలా ఉంటే... అప్పుడు ఇలాంటి కళ్లజోడు భలేగా ఉంటుందికదూ... సరిగ్గా ఇలాంటి కళ్లజోడును శాస్త్రవేత్తలు తయారుచేశారు. ఈ కళ్లజోడు పెట్టుకుంటే ఇక కళ్లలో మందు వేసుకోవడం మరిచిపోయే అవకాశమే ఉండదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
హార్వర్డ్ మెడికల్ స్కూల్, మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి చెందిన శాస్త్రవేత్తలు సంయుక్తంగా అత్యాధునిక కాంటాక్ట్ లెన్స్‌ను తయారుచేశారు. ఈ లెన్స్‌తో తయారుచేసిన కళ్లజోడు పెట్టుకుంటే అది కంటిలో మందు కూడా వేస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీంతో కంటిలో మందు వేసుకోవడం మరచిపోవడం అనేది జరగదని కూడా వీరు చెబుతున్నారు. గ్లూకోమా వంటి కంటి వ్యాధులకు తరచూ కంట్లో మందు వేసుకోవాల్సి ఉంటుంది. కానీ ఈ లెన్సుతో తయారుచేసిన కళ్లజోడు పెట్టుకుంటే అప్పుడు కంట్లో మనం ప్రత్యేకించి మందు వేసుకోవాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే ఈ లెన్సులే మన కంట్లో మందు వేస్తాయట.
గ్లూకోమా వంటి కంటివ్యాధులకు ఈ లెన్సు వల్ల శాశ్వత పరిష్కారం లభిస్తుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఈ లెన్సును లాటానోప్రోస్ట్-పాలీమర్ ఫిల్ములతో రూపొందించారు. వీటిలో మందు కూడా ఒక ఫిల్మురూపంలో ఉంటుంది. ఇవి ఒక నిర్ణీత వ్యవధిలో వారాలు, నెలలపాటు కంటిలో మందును విడుదల చేయగల సామర్ధ్యాన్ని కలిగివుంటాయని ఈ పరిశోధనకు నేతృత్వం వహించిన ప్రొఫెసర్ డేనియల్ కోనె చెబుతున్నారు. ఈ లెన్సులను జంతువుల్లో పరీక్షించినప్పుడు వాటిలో ఎలాంటి సమస్యలు తలెత్తలేదని, గ్లూకోమా వంటి వ్యాధుల వల్ల ప్రపంచవ్యాప్తంగా ఏటా కొన్ని లక్షలమంది కంటిచూపును కోల్పోతున్నారని, ఇలాంటి లెన్సులను వాడడం వల్ల కంటిచూపును కోల్పోయే ప్రమాదాన్ని గణనీయంగా తగ్గించవచ్చని కోనె చెబుతున్నారు.