: 'ఫ్రీడం' అంటే ఇలా... తిరుగుతూ నివసించడం


నివాసం అంటే ఏదో ఒకచోట స్థిరంగా ఏర్పాటు చేసుకునేది. మరి తిరుగుతూ నివసించడం ఏంటి... ఏదైనా హోటల్‌లో నివాసం ఏర్పాటు చేసుకున్నా ఎక్కడికి వెళితే అక్కడ హోటల్‌లో నివాసానికి గది వెతుక్కోవాలి. అది కాస్త తలనొప్పితో కూడుకున్నది. అలాకాకుండా చక్కగా మనకంటూ ఒక స్థిర నివాసం లాగా ఉండి... అది కూడా చక్కగా తిరుగుతూ ఉండేదిగా ఉంటే ఎంత బాగుండునో... మళ్లీ మీకు తిరుగుతూ ఉండే నివాసం అంటే అనుమానం వస్తోందా... అంటే నీటిలో తేలియాడుతూ తిరుగుతూ ఉండాలి... అదేనండీ, పడవలాంటి నివాసం... అలాంటి దానిలో మనం ఉంటూ చక్కగా దేశాలు తిరుగుతూ బతికేస్తే భలేగా ఉంటుందికదూ. అలా ఒకేచోట నివాసం ఉండడం అంటే బోరుకొట్టే వారికోసం ఒక భారీ షిప్‌ను తయారుచేయనున్నారు. ఇది ఎంత భారీ అంటే దీన్ని తిరిగే నగరంగా అభివర్ణించారంటే నమ్మండి.

ఫ్లోరిడాకు చెందిన ఫ్రీడంషిప్‌ ఇంటర్నేషనల్‌ సంస్థ ఒక పెద్ద షిప్‌ నిర్మాణానికి ప్రణాళికలను సిద్ధం చేసుకుంటోంది. ఇది ఎంత పెద్ద షిప్పంటే... ఇందులో యాభై వేలమంది శాశ్వత నివాసం ఏర్పాటు చేసుకోవచ్చు. ఇందులో 30 వేలమంది సందర్శకులు రావచ్చు. అలాగే ఇందులో పనిచేయడానికి 20 వేలమంది సిబ్బంది కూడా ఉండడానికి చోటు ఉంటుంది. ఇంకా అంతమంది నివాసం అంటే వారందరికీ సరిపడేలా ఉండే పాఠశాలలు, ఆసుపత్రులు, వ్యాపార సముదాయాలు, పార్కులు, ఆర్ట్‌ గ్యాలరీలు, షాపింగ్‌ కాంప్లెక్సులు, కేసినో, ఇంకా ఒక విమానాశ్రయం కూడా ఇందులో ఉండేలా దీన్ని రూపొందించనున్నారు.

దీని పొడవు 4,500 అడుగులు, వెడల్పు 750 అడుగులు. ఇవన్నీ నిర్మిస్తే దీని బరువు సుమారు 2.7 మిలియన్‌ టన్నులు ఉంటుంది. ఇంతపెద్ద షిప్పును తయారుచేయడానికి సుమారు 62 వేల కోట్ల రూపాయలకు పైగానే ఖర్చవుతుందని దీని తయారీదారులు అంచనా వేస్తున్నారు. అన్నట్టు ప్రపంచమంతా చుడుతూ ఎక్కడా స్థిరంగా ఉండకుండా తిరిగే ఈ ఫ్రీడమ్‌ షిప్పు నగరం సౌరశక్తితో తిరుగుతుంది. ఇంతపెద్ద షిప్పు నగరం తయారైతే ఇందులో నివాసం ఏర్పాటు చేసుకోవాలనుకునేవారు ఇప్పటినుండే ఇందుకు సన్నాహాలు ప్రారంభించండిమరి!

  • Loading...

More Telugu News