: షుగరొస్తే కాలేయానికి కూడా ముప్పే


షుగరుతో బాధపడేవారు పాపం కడుపునిండా ఆహారం కూడా తినడానికి భయపడుతుంటారు. ఇలా షుగరుతో బాధపడేవారిలోనే కాలేయానికి సంబంధించిన అనారోగ్యం కూడా తలెత్తే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు నిర్వహించిన తాజా అధ్యయనంలో తేలింది. మామూలుగా ఉన్నవారితో పోలిస్తే షుగరు ఉన్న రోగులకు కాలేయ క్యాన్సర్‌ వచ్చే ముప్పు మరింత ఎక్కువగా ఉందని పరిశోధకులు ఈ అధ్యయనంలో గుర్తించారు.

దక్షిణ కాలిఫోర్నియా విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు నిర్వహించిన అధ్యయనంలో మధుమేహం లేని వారితో పోల్చితే షుగరుతో బాధపడేవారిలో కాలేయానికి సంబంధించిన హెపటోసెల్యూలార్‌ కార్సినోమా అనే రకం క్యాన్సర్‌ వచ్చే అవకాశాలు రెండు నుండి మూడు రెట్లు అధికంగా ఉన్నాయని తేలింది. వెండీ నేతృత్వంలో సాగిన ఈ అధ్యయనంలో శాస్త్రవేత్తలు విభిన్నజాతులకు చెందిన సుమారు 1.5 లక్షలమంది ఆరోగ్య రికార్డులను 15 ఏళ్లపాటు పరిశీలించారు. 15 ఏళ్ల తర్వాత వీరిలో 506 మంది హెపటోసెల్యూలార్‌ కార్సినోమా బారిన పడినట్టు ఈ పరిశోధనలో తేలింది.

ఈ అధ్యయనంలో మధుమేహం ఉన్నవారు కాలేయ క్యాన్సర్‌ బారిన పడడమేకాకుండా ఇందులో ఏయే జాతులకు చెందిన వారు ఇలా క్యాన్సర్‌ బారిన పడ్డారో ఆయా జాతుల్లో కూడా మధుమేహానికి గురికావడం ఎక్కువగా జరుగుతోందని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ ఫలితాలను గురించి సారధి వెండీ మాట్లాడుతూ మధుమేహం బారినపడే అవకాశం ఎక్కువగా ఉన్న జాతులకు చెందిన ప్రజలను ప్రభుత్వాలు ముందుగానే హెచ్చరించి, వారు ఆరోగ్యపరంగా తగు జాగ్రత్తలను తీసుకునేలా ప్రోత్సహించాలని అన్నారు. ఇలా చేయడం వల్ల భవిష్యత్తులో ఆయా జాతుల్లో ఎక్కువమందిని మధుమేహం మరియు క్యాన్సర్‌ బారినుండి రక్షించవచ్చని చెబుతున్నారు.

  • Loading...

More Telugu News