: రోడ్డు ప్రమాదంలో ప్రవాస భారతీయుడు మృతి.. సింగపూర్ లో చెలరేగిన హింస
నిన్న (ఆదివారం) సాయంత్రం సింగపూర్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రవాస భారతీయుడు ప్రాణాలు కోల్పోయాడు. సింగపూర్ టెక్కా సెంటర్ సమీపంలో 33 ఏళ్ల శక్తివేల్ కుమార వేలును ట్రక్కు ఢీకొనడంతో అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. మృతుడు హేంగ్హప్ పూన్ కంపెనీలో రెండేళ్లుగా ఇంజనీరుగా విధులు నిర్వర్తిస్తున్నాడు. దీంతో ఆగ్రహించిన నాలుగొందల మంది దక్షిణాసియా వలస కార్మికులు ఆందోళనలకు దిగారు. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు ప్రయత్నించడంతో ఘర్షణ చోటు చేసుకుంది. ఆందోళనకారులు పోలీసు వాహనాలపై దాడి చేసి పలు ప్రైవేట్ వాహనాలను ధ్వంసం చేశారు. దీంతో పది మంది పోలీసు అధికారులకు గాయాలయ్యాయి. ఇప్పటివరకు 27 మంది ఆందోళనకారులను అదుపులోకి తీసుకొన్నామని సింగపూర్ పోలీసులు తెలిపారు. దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రధాని లీ హైసన్ లాంగ్ ఆదేశించారు.