: స్పీకర్ కు అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చాం: సబ్బం హరి


ప్రభుత్వంపై 198 రూల్ కింద అవిశ్వాస తీర్మానంపై లోక్ సభ స్పీకర్ మీరాకుమార్ కు నోటీసు ఇచ్చామని కాంగ్రెస్ ఎంపీ సబ్బం హరి చెప్పారు. రాష్ట్ర విభజనను ఆపేందుకు ఆవగింజ అవకాశాన్నీ వదులుకోబోమని చెప్పారు. తమ ప్రయత్నాన్ని శంకించవద్దని విజ్ఞప్తి చేశారు. పార్లమెంటు వెలుపల సబ్బం హరి మీడియాతో మాట్లాడారు. అవిశ్వాస తీర్మానం నోటీసు ఇవ్వడానికి 55 మంది మద్దతు అవసరం లేదని, దానిపై చర్చకు, ఓటింగ్ చేపట్టడానికి మాత్రమే సభలో 55 మంది సభ్యుల మద్దతు అవసరమని చెప్పారు.

ఒక్క సభ్యుడు నోటీసు ఇచ్చినా స్పీకర్ సభలో ఫలానా సభ్యుడు అవిశ్వాస తీర్మానాన్ని ప్రతిపాదించారని.. దీనికి ఎవరైనా మద్దతిస్తున్నారా? అంటూ అడుగుతారని ప్రక్రియను వివరించారు. అప్పుడు 55 మంది సభ్యులు మద్దతు తెలిపితే అవిశ్వాస తీర్మానాన్ని చర్చకు చేపడతారని తెలిపారు. తామిచ్చిన అవిశ్వాస తీర్మానం నోటీసుపై రేపు సభలో స్పీకర్ ఏ నిర్ణయం తీసుకుంటారు? ఎలా వ్యవహరిస్తారు? అన్నది చూస్తామని చెప్పారు. స్పీకర్ కు ఇచ్చిన తీర్మానం నోటీసులో సబ్బం హరితోపాటు కాంగ్రెస్ ఎంపీలు లగడపాటి రాజగోపాల్, హర్షకుమార్, ఉండవల్లి అరుణ్ కుమార్, సాయిప్రతాప్, రాయపాటి సాంబశివరావు సంతకాలు చేశారు. అయితే, ఈ విషయంలో నైతికంగా వ్యవహరిస్తున్నారా? అంటూ ఒక విలేకరి అడిగిన ప్రశ్నకు.. తమ పార్టీ, ప్రభుత్వం నైతికంగా వ్యవహరించనప్పుడు.. తమ నైతికత గురించి అడగద్దన్నారు.

  • Loading...

More Telugu News