: కాంగ్రెస్ అహంకార ధోరణికి ఈ ఎన్నికలు చెంపపెట్టులాంటివి: వెంకయ్యనాయుడు
కాంగ్రెస్ పార్టీ ఎన్ని తప్పుడు హామీలిచ్చినా, ప్రజలు నమ్మలేదని బీజేపీ సీనియర్ నేత వెంకయ్యనాయుడు తెలిపారు. మూడు సార్లు సీఎంగా పనిచేసిన షీలా దీక్షిత్ కూడా ఓడిపోవడంతో, కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఎంతగా అసహ్యించుకుంటున్నారో అర్థమవుతుందని అన్నారు. కాంగ్రెస్ అహంకార ధోరణికి ఈ ఎన్నికలు చెంపపెట్టులాంటివని చెప్పారు. హైదరాబాద్ లోని బీజేపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. అవినీతి, సుపరిపాలన అనేవి ప్రధానమైన అంశాలని ఈ ఎన్నికలు రుజువు చేశాయన్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం రావాలని ప్రజలు కోరుకుంటున్న విషయం ఈ ఎన్నికలతో తేటతెల్లమైందని చెప్పారు.
బీజేపీ పరిపాలన పట్ల ప్రజలు సంతోషంగా ఉన్నారన్న విషయాన్ని మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్ ఎన్నికల ఫలితాలు తెలియజేస్తున్నాయని వెంకయ్యనాయుడు చెప్పారు. అయితే ఛత్తీస్ గఢ్ లో సానుభూతి పవనాలు వీయడంతో కాంగ్రెస్ కొంత వరకు పుంజుకుందని అభిప్రాయపడ్డారు. ఈ ఎన్నికల విజయంలో బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ ప్రభావం ఎంతో ఉందని అన్నారు. రానున్న పార్లమెంటు ఎన్నికల్లో మోడీ హవా నడుస్తుందని చెప్పారు.