: విభజనకు సహకరించేది లేదని స్పష్టం చేసిన సీఎం కిరణ్
రాష్ట్ర విభజన బిల్లులో రాజ్యాంగపరమైన చిక్కులున్నాయని సీఎం కిరణ్ చెప్పారు. ఆంధ్రప్రదేశ్ విభజనకు ఎట్టి పరిస్థితుల్లోనూ సహకరించేది లేదని ఆయన తేల్చి చెప్పారు. విభజన జరిగితే నీటి పంపిణీ చిక్కులు వస్తాయని, దీంతో విద్యుత్ ఇబ్బందులు తప్పవన్నారు. ఆయన అధిష్ఠానంపై నిప్పులు చెరిగారు. ఆంధ్రప్రదేశ్ లో ఏ ప్రాంత ముఖ్యమంత్రి పనిచేసినా తెలంగాణకు అన్యాయం చేయలేదని ఆయన గుర్తు చేశారు. తెలుగు ప్రజల మనోభావాలను విభజన నిర్ణయం దెబ్బతీసిందన్నారు.
సమైక్యాంధ్ర ఉద్యమాన్ని పట్టించుకోలేదన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందులు వచ్చినపుడు పార్టీకి తాము చేసిన సాయమే ఇప్పుడు పాపమైందని అధిష్ఠానంపై కిరణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సమైక్యాంధ్ర ఉద్యమంలో రోజూ లక్షలాది మంది ప్రజలు రోడ్డు పైకి వచ్చి నిరసన తెలిపినా ఢిల్లీ పెద్దలకు కనపడలేదన్నారు. సమైక్యాంధ్ర కావాలని తెలుగు ప్రజలు నినదించినా హస్తిన పెద్దలు వినిపించుకోలేదన్నారు. ఇది ధృతరాష్ట్ర పాలన అంటూ కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించారు.
రాష్ట్ర విభజన విషయంలో ఢిల్లీ పెద్దలు సమన్యాయం పాటించలేదని, కాంగ్రెస్ అధిష్టానం ఆంధ్రప్రదేశ్ లో కూర్చున్న కొమ్మనే నరుక్కొంటోందన్నారు. ఇప్పటికైనా ఢిల్లీ పెద్దలు పునరాలోచించాల్సిన అవసరం ఉందని సీఎం కిరణ్ అన్నారు. కేసీఆర్, జగన్, చంద్రబాబు చెప్పారని విభజన నిర్ణయం చేశారా? అయితే వచ్చే ఎన్నికల్లో వారినే కలుపుకుని ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోండని కాంగ్రెస్ అధిష్టానానికి సలహా ఇచ్చారు. అంతేగాని, రాజకీయ కారణాలతో రాష్ట్రాన్ని ముక్కలు చేయొద్దని కాంగ్రెస్ అధిష్టానాన్ని ఆయన హెచ్చరించారు.