: పోలవరం, భద్రాచలం విషయాలు మనస్తాపం కలిగించాయి: పురంధేశ్వరి


విభజన నేపథ్యంలో తెలంగాణ చేసిన అన్ని డిమాండ్లకు తలూపి, సీమాంధ్రులకు ఇవ్వాల్సిన వాటిపై కేంద్రం తీవ్ర నిర్లక్ష్యం వహించడంపై కేంద్రమంత్రి పురంధేశ్వరి ఆవేదన వ్యక్తం చేశారు. విభజన ఆగదని తెలిసాక సీమాంద్ర సమస్యల కోసం పట్టుబట్టామని హైదరాబాదులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అన్నారు. అయినా, పెడచెవిన పెట్టిన కేంద్రం వారడిగిన వాటికే ఓకే చెప్పిందన్నారు. ఈ క్రమంలో జీవోఎం నివేదికలో పెట్టిన పోలవరం, భద్రాచలం అంశం తనకు మనస్తాపం కలిగించిందని చెప్పారు. పోలవరం ప్రాజెక్టు పూర్తిగా ఆంధ్ర ప్రాంతంలో ఉండాలన్నదే తన అభిప్రాయమని ఆమె అన్నారు. ఉమ్మడి రాజధాని అనేది రాజ్యాంగంలో లేదని, హైదరాబాదులో సీఎం ఉంటే ఆ రాష్ట్రాన్ని ఎలా పాలించగలరని ప్రశ్నించారు. ఉమ్మడి రాజధాని అంటే ఆంధ్ర ప్రాంత సీఎంను అవమానించడమేనన్నారు. అంతేగాక, ఆంధ్రా ముఖ్యమంత్రి హైదరాబాదులో ఉంటే ప్రజలకు అందుబాటులో ఎలా ఉండగలరని అడిగారు.

సీమాంధ్రకు ఉన్నత విద్యా సంస్థలు ఇస్తామన్నారని కానీ, వాటికి సంబంధించిన నిధుల విషయంలో స్పష్టత ఇవ్వలేదన్నారు. ముందు ఉన్నత విద్య విషయంలో సీమాంధ్ర విద్యార్ధులకు భరోసా కల్పించాల్సి ఉందని, విద్యా సంస్థల విషయంలో స్పష్టత ఇవ్వాల్సి ఉందని పేర్కొన్నారు. ఇలా కేంద్రం చెప్పినట్లు చూస్తే సీమాంద్రలో విద్యాసంస్థలు 2021 నాటికి పూర్తవుతాయన్నారు. సీమాంధ్రకు పెట్టుబడులు సరిగా రాకుంటే భవిష్యత్తులో ఉద్యోగావకాశాలు ఉండవని.. ప్రోత్సాహకాలు, పన్ను మినహాయింపుపై బిల్లులో ఎలాంటి హామీలు లేవని పురంధేశ్వరి చెప్పుకొచ్చారు.

  • Loading...

More Telugu News