: ప్రధాని వచ్చి కూర్చున్నా పోలవరం పూర్తి కాదు: కావూరి


సాక్షాత్తూ దేశ ప్రధాని వచ్చి పోలవం పూర్తి కావాలని కోరుకున్నా పూర్తికాదని కేంద్రమంత్రి కావూరి అన్నారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, తాము కనీసం పదేళ్లయినా ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ను ఉంచాలని అడిగామని అన్నారు. పదేళ్లు తమకు అన్యాయం జరగకుండా ఉండే అవకాశం ఉందని ఆయన తెలిపారు. సీమాంధ్రకు అన్యాయం జరగడం లేదు సరికదా, మరింత అభివృద్ధి జరుగుతుందని సీమాంధ్ర ప్రజలకు చెబుతామని కావూరి తెలిపారు.

విభజన విధానం వల్ల శత్రుత్వం పెరగకూడదని, స్నేహ భావం పెరగాలంటే విభజన మరింత న్యాయంగా జరగాలని అన్నారు. భద్రాచలం డివిజన్ తొలి నుంచీ ఆంధ్రా ప్రాంతంలోనే ఉందని, అయితే 1959లో జీవో 111 ఇచ్చి ఖమ్మంలో కలిపారని ఆయన గుర్తు చేశారు. పోలవరం కావాలంటే భద్రాచలం ఆంధ్రాలోనే ఉండాలని అన్నారు. గతంలో తెలంగాణకు చెందిన రాజకీయ నాయకులు ఒడిశా, ఛత్తీస్ గఢ్ రాష్ట్రాలకు వెళ్లి ప్రాజెక్టుని అడ్డుకుని, ఇబ్బందులు సృష్టించాలని కోరారని తెలిపారు.

ఒక వేళ కేంద్రం వచ్చి చెప్పినా భద్రాచలం తెలంగాణలో కలిపితే పోలవరం వాస్తవరూపం దాల్చదని ఆయన ఘంటాపథంగా చెప్పారు. గిరిజనులకు జీవన భృతి చూపాలంటే భద్రాచలాన్ని ఆంధ్రాలోనే ఉంచాలని అయన అన్నారు. ధవళేశ్వరం ప్రాజెక్టు కింద కేవలం ఒక్క టీఎంసీ నీటితోనే 10లక్షల 27 వేల ఎకరాలు పండుతున్నాయని, రేపు భద్రాచలం తెలంగాణకు కేటాయిస్తే నదీ జలాలు అడ్డుకుని సీమాంధ్రను ఎడారి చేస్తారని ఆయన తెలిపారు.

భద్రాచలాన్ని తెలంగాణలో ఉంచి సాక్షాత్తు ప్రధాని వచ్చి కూర్చున్నా పోలవరం ప్రాజెక్టు కార్యరూపం దాల్చదని ఆయన స్పష్టం చేశారు. దేశంలోనే అనంతపూర్, జైసల్మేర్ కరవు కాటకాలకు పెట్టింది పేరని ఇప్పుడు మరింత కష్టకాలంలోకి ఆ ప్రాంతం నెట్టివేయబడుతుందని అన్నారు. అందుకే తాము విభజన జరిగితే రాయల తెలంగాణకు తాము అనుకూలం అని చెప్పామని తెలిపారు. దాన్ని కూడా ఒప్పుకోకపోవడంతో విభజన నిర్ణయంలో తాను భాగస్వామిని కాలేనని నిష్క్రమించానని మంత్రి అన్నారు.

  • Loading...

More Telugu News