: తెలంగాణపై ఢిల్లీలో కీలక మంతనాలు
ఢిల్లీ వెళ్ళిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కీలక నేతలు అందరితోనూ సమావేశం అవుతున్నారు. ప్రస్తుతం కేంద్ర హోం మంత్రి షిండేను కలిసిన కిరణ్ కుమార్, తెలంగాణ సహా రాష్ట్రంలోని పరిస్థితులపై ప్రధానంగా చర్చిస్తున్నారు. ఈ భేటీ ముగిసిన తర్వాత ప్రధాని మన్మోహన్ సింగ్, వయలార్ రవితో కూడా కిరణ్ సమావేశం కానున్నారు. తెలంగాణపై ఒక స్పష్టమైన నిర్ణయం దిశగా చర్చలు కొనసాగుతున్నట్లు సమాచారం.
నిన్న ఢిల్లీకి వచ్చిన ముఖ్యమంత్రి తొలి రోజు ఆజాద్, సోనియా, రాష్ట్రపతి ప్రణబ్ తో భేటీ అయిన సంగతి తెలిసిందే. మరోవైపు పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యన్నారాయణ, రాష్ట్ర గవర్నర్ నరసింహన్ కు 8న ఢిల్లీకి రావాలని పిలుపు అందింది. తెలంగాణ అంశంలో వీరితో కూడా కాంగ్రెస్ పెద్దలు సమాలోచన జరపనున్నారు. మొత్తం మీద ఢిల్లీలో పరిణామాలు చూస్తుంటే సాధ్యమైనంత త్వరగా తెలంగాణపై నిర్ణయం వెలువడేట్లుగా కనిపిస్తోంది.