: మరిది, అల్లుడు కామాంధులు.. వారి బారినుండి రక్షించండి
భర్త మద్యానికి బానిసయ్యాడు.. బాధ్యతలు మర్చిపోయాడు.. అంతటితో ఆగకుండా తనపై అభాండాలు వేస్తూ వేదనకి గురిచేస్తున్నాడు. అన్నింటినీ భరిస్తూ గాజుల షాపుతో సంసారాన్ని ఈదుతున్న తనపై... తన మరిది, ఆడపడుచు కుమారుడు లైంగిక వేధింపులకు పాల్పడుతూ మానసిక వేదనకు గురి చేస్తున్నారంటూ రంగారెడ్డి జిల్లా పరిగి పట్టణానికి చెందిన వివాహిత ఆస్రాబేగం రాష్ట్ర మానవహక్కుల కమిషన్ ను ఆశ్రయించింది.
వీరి ఆగడాలపై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసినా, రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి పట్టించుకోవడం లేదని ఫిర్యాదులో తెలిపింది. బాధితురాలు తెలిపిన వివరాల మేరకు, పదేళ్ల క్రితం ఆమెకు గాజుల బస్తీ నివాసి మహ్మద్ ఖదీర్ తో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు పుట్టారు. ఆ తరువాత మద్యానికి బానిసైన ఖదీర్ ఆమెను వేధించసాగాడు. కుటుంబాన్ని పట్టించుకోవడం మానేశాడు. దీంతో మరిది అసద్, ఆడపడుచు కుమారుడు అబ్బు తనతో అసభ్యంగా ప్రవర్తిస్తూ, వివాహేతర సంబంధం పెట్టుకోవాలని వేధిస్తున్నారు. ఇటీవల లైంగిక దాడికి కూడా పాల్పడ్డారు.
ఇదేంటని నిలదీసిన తన సోదరులపై దాడి చేసి గాయపరిచారు. వారి వేధింపులను పట్టించుకోని తన భర్త తనపైనే అసత్య ప్రచారానికి తెరతీశాడని ఆమె వాపోయింది. ఆమె అత్త రాజకీయ నాయకురాలు కావడంతో కేసు పెట్టినా పోలీసులు పట్టించుకోవడం లేదని, వారు తనపై ఏ క్షణంలోనైనా దాడికి పాల్పడే అవకాశం ఉన్నందున తనకు రక్షణ కల్పించాలని ఆమె మానవహక్కుల కమిషన్ ను కోరింది. దీంతో ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి, జనవరి 20 లోపు పూర్తి నివేదిక సమర్పించాలని రాష్ట్ర మానవహక్కుల కమిషన్ ఛైర్మన్ రంగారెడ్డి ఎస్పీని ఆదేశించారు.