: స్వచ్చందంగా కిడ్నాప్ అయి 10 మందిని రక్షించిన సాహసబాలిక
తోటివారిని రక్షించడం మానవ కర్తవ్యం.. ధర్మం అని నిరూపించింది 14 ఏళ్ల అసోం చిన్నారి. తన స్కూల్ బస్సులో ఉన్న 10 మందిని కిడ్నాపర్ (అసోం తీవ్రవాది అనే అనుమానం) తీసుకెళ్లే ప్రయత్నంలో ఉండగా.. 'వద్దు వద్దు నన్ను తీసుకెళ్లండి' అంటూ తానొక్కతే అతని వెంట నడిచి వెళ్లింది గుంజన్ శర్మ. అసోంలోని శివసాగర్ జిల్లా శిమలగురి వద్ద ఇది జరిగింది.
నజీరా కేంద్రీయ విద్యాలయానికి చెందిన బస్సు గుంజన్ సహా 11 మంది విద్యార్థులను బుధవారం సాయంత్రం ఇళ్లకు తీసుకెళుతోంది. ఆ సమయంలో సాయుధుడైన కిడ్నాపర్ బస్సును ఆపి వారిని తీసుకెళ్లబోవడంతో గుంజన్ సరెండర్ అయిపోయింది. గుంజన్ ను కిడ్నాపర్ అడవుల్లో చాలాదూరం నడిపించుకుని వెళ్లాడు. రాత్రివేళ చిమ్మచీకటి. ఆహారం లేదు. కళ్లు పెద్దవి చేసి చూసినా ఏమీ కనిపించడం లేదు. తెల్లారి వెలుగు విచ్చుకోగానే.. పక్కన కిడ్నాపర్ లేడు. ఎలాగోలా గుంజన్ నడచుకుంటూ సమీప గ్రామానికి చేరుకుంది. పోలీసుల సహకారంతో ఆమె తన ఇంటికి క్షేమంగా చేరింది.