: అరచేతుల్లో అధ్యయనాలు
ఇప్పుడు చాలా వరకూ కొందరి చేతులే వారికి తరగతి గదులుగా మారి పాఠాలను నేర్చుకునేలా చేస్తున్నాయి. అరచేతులు పాఠాలు ఎలా బోధిస్తాయా? అని అనుమానంగా ఉందా... అరచేతులు అంటే అరచేతుల్లో ఉండే స్మార్ట్ ఫోన్లు. ఇప్పుడు ఎక్కడ చూసినా ఎక్కువమంది చేతుల్లో ఉండే స్మార్ట్‌ఫోన్లు బోలెడు రకాలుగా ఉపయోగపడుతున్నాయి. ఇందులో భాగంగానే ఎక్కడున్నా వారికి చక్కటి తరగతి గదుల్లాగా కూడా ఉపయోగపడుతున్నాయి. ఇప్పటికే స్మార్ట్ ఫోన్లతో షాపింగ్, బ్యాంకింగ్, చాటింగ్ వంటి అనేక పనులను అరచేతితో ఇలా అవలీలగా చేయగలుగుతున్నాం. ఇప్పుడు కార్పొరేట్ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు అరచేతితోనే అవలీలగా ఎక్కడినుండో బోధన జరిగే పాఠాలను చక్కగా తమ తీరిక వేళల్లో అభ్యసించడానికి ప్రయత్నిస్తున్నారు.
చేతిలో ఉండే స్మార్ట్ ఫోన్లను తరగతి గదులుగా ఉపయోగించడంలో ఆసియా`పసిఫిక్ దేశాల్లోని ఉద్యోగులు ముందున్నారట. ఇక్కడి ఉద్యోగుల్లో 86 శాతం మంది వృత్తిపరంగా తమ నైపుణ్యాన్ని, పరిజ్ఞానాన్ని పెంచుకోవడంలో స్మార్ట్‌ఫోన్లు, టాబ్లెట్లు, ల్యాప్‌టాప్‌లను విపరీతంగా ఉపయోగిస్తున్నారని స్కిల్‌సాఫ్ట్ చేసిన సర్వేలో తేలింది. ఈ సంస్థ అందించిన నివేదిక ప్రకారం మనదేశంలో కేవలం 46 శాతం కంపెనీలు మాత్రమే తమ ఉద్యోగులకు ఇ-లెర్నింగ్ సదుపాయాన్ని కల్పిస్తున్నాయని, మరో 54 శాతం కంపెనీలు నెట్‌వర్క్ సమస్యలు, నెట్‌వర్క్ భయాల వల్ల ఇలాంటి కార్యక్రమాలకు కాస్త దూరంగా ఉన్నాయని తేలింది. ఇ-లెర్నింగ్‌ను అమలుచేస్తున్న దేశీయ కంపెనీల సంఖ్య గణనీయంగా పెరిగిందని స్కిల్‌సాఫ్ట్ ఇండియా మేనేజర్ వినయ్ ప్రధాన్ చెబుతున్నారు.
ఇ-లెర్నింగ్ వల్ల రోజువారీ పనితీరు చాలావరకూ మెరుగుపడుతోందని ఈ సర్వేలో పాల్గొన్న 74 శాతం మంది ఉద్యోగులు చెబుతున్నారు. ఈ విధానం ద్వారా తాము నేర్చుకున్న అంశాలను వృత్తి నిర్వహణలో సమర్ధవంతంగా అమలు చేయగలుగుతున్నామని 81 శాతం మంది ఉద్యోగులు చెబుతున్నారు. ఈ సర్వేకోసం స్కిల్‌సాఫ్ట్ సంస్థ 20 రంగాల్లోని 300 కార్పొరేట్ సంస్థలనుండి సమాచారాన్ని సేకరించింది. ఇందులో ఐటీ, టెక్నికల్ సర్వీసులు, విద్యా/శిక్షణ విభాగాల వాటా 42 శాతంగా ఉంది. ఇ-లెర్నింగ్‌ను అమలు చేయడం ద్వారా తమ బడ్జెట్ పెరుగుతోందని ఈ సర్వేలో పాల్గొన్న వాటిలో 67 శాతం కంపెనీలు చెబుతున్నాయి. ఒక్కో లెర్నర్‌పై 75 శాతం కంపెనీలు 800 డాలర్లను ఖర్చు చేస్తున్నాయట.