: రెండు జిల్లాల కోసం పాకులాడితే.. పది జిల్లాల్లో పతనమే: కేటీఆర్
రాయల తెలంగాణ అంటేనే, తెలంగాణ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయని తెరాస నేత కేటీఆర్ అన్నారు. రాయల తెలంగాణ ప్రతిపాదనను కాంగ్రెస్ అధిష్ఠానం వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. రాయలసీమలోని రెండు జిల్లాల కోసం పాకులాడితే, తెలంగాణలోని పది జిల్లాల్లో కాంగ్రెస్ తుడిచిపెట్టుకుని పోతుందని హెచ్చరించారు. హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో కేటీఆర్ మీడియా సమావేశంలో మాట్లాడారు. శీతాకాల సమావేశాల్లోనే తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టాలని ఆయన కోరారు.
హైదరాబాద్ లో పరిశ్రమలు పెట్టుకున్నవారు, బస్సులు తిప్పుకునే వారే రాయల తెలంగాణ అంటున్నారని కేటీఆర్ విమర్శించారు. ఈ శీతాకాల సమావేశాల్లోనే తెలంగాణ బిల్లు పెట్టాలని డిమాండ్ చేశారు. పార్లమెంటులో టీబిల్లు పెడితే ఆమోదం పొందడం ఖాయమని చెప్పారు. సీడబ్ల్యూసీ నిర్ణయాన్ని అమలుచేయకపోతే కాంగ్రెస్ పార్టీ తన మరణశాసనాన్ని తానే రాసుకున్నట్టవుతుందని అన్నారు. హైదరాబాద్, భద్రాచలం, మునగాలను వదులుకునే స్థితిలో తెలంగాణ ప్రజలు లేరని... అలాగే తమది కానిది కూడా తమకు వద్దని కేటీఆర్ తెలిపారు.