: నేటి నుంచి సఫారీ వేట.. టీం ఇండియా చరిత్ర సృష్టిస్తుందా?
సఫారీ గడ్డపై 21 ఏళ్లుగా సాధ్యపడని వన్డే సిరీస్ విజయం కోసం ధోనీ యువసేనకు అద్భుతమైన అవకాశం వచ్చింది. ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ లో మొదటి స్థానంలో ఉన్న ఇండియా, ఐదో స్థానంలో ఉన్న దక్షిణాఫ్రికాను చిత్తు చేయడానికి ఉత్సాహంగా ఎదురుచూస్తోంది. ఈ రోజు జొహానెస్ బర్గ్ లోని వాండరర్స్ స్టేడియంలో సాయంత్రం 5 గంటలకు ఆరంభం కానున్న మూడు వన్డేల సిరీస్ లో చరిత్ర సృష్టించడానికి పూర్తి స్థాయిలో సిద్ధమైంది. ఈ సిరీస్ ను భారత్ గెలుచుకుంటే... సపారీ గడ్డపై తొలి వన్డే సిరీస్ ను గెలుచుకున్న జట్టుగా ధోనీ సేన అవతరిస్తుంది. ఇప్పటిదాకా సఫారీ గడ్డపై దక్షిణాఫ్రికాతో 25 మ్యచ్ లు ఆడగా... అందులో 19 మ్యాచ్ లలో సఫారీలు గెలవగా, కేవలం ఐదు మ్యాచ్ లను మాత్రమే భారత్ గెలుచుకుంది. మరో మ్యాచ్ లో ఫలితం తేలలేదు.
ఇటీవలి కాలంలో భారత జైత్రయాత్రలో కీలకపాత్ర పోషిస్తున్న బ్యాటింగ్ త్రయం శిఖర్ ధవన్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు మన పిచ్ లపై ప్రదర్శించిన దూకుడును సఫారీ పిచ్ లపై కూడా కొనసాగిస్తే... భారత్ సగం సక్సెస్ అయినట్టే. అయితే, దక్షిణాఫ్రికా పిచ్ లు పేస్ బౌలర్లకు పూర్తి స్థాయిలో అనుకూలిస్తాయి. ఇలాంటి పిచ్ లపై మన యువ ఆటగాళ్లు ఏ మేరకు రాణిస్తారనేది వేచి చూడాల్సిందే.
అయితే ప్రస్తుతం భారత్ కంటే దక్షిణాఫ్రికానే ఎక్కువ ఒత్తిడిలో ఉంది. ఎందుకంటే, ప్రస్తుతం సఫారీ జట్టు వరుస వైఫల్యాలతో సతమతమవుతోంది. ఛాంపియన్స్ ట్రోఫీ, న్యూజిలాండ్, శ్రీలంక వన్డే సిరీస్ లలో దక్షిణాఫ్రికా జట్టు ఓటమి పాలైంది. తాజాగా సొంతగడ్డపై పాకిస్థాన్ తో జరిగిన వన్డే సిరీస్ ను కూడా కోల్పోయింది. దీంతో, భారత్ తో జరగనున్న సిరీస్ ముందు దక్షిణాఫ్రికా తన ఆత్మ విశ్వాసాన్ని పూర్తి స్థాయిలో కోల్పోయింది. ఈ విషయాన్ని సౌత్ ఆఫ్రికా కెప్టెన్ డివిలియర్స్ కూడా అంగీకరించాడు. మరో వైపు పేసర్లకు పూర్తిగా సహకరించే పిచ్ లపై ఆధిపత్యం ప్రదర్శించడానికి సఫారీ జట్టులో నాణ్యమైన పేసర్లు కూడా కరవయ్యారు. మోర్కెల్, స్టెయిన్ లాంటి బౌలర్లు ఊహించిన స్థాయిలో రాణించలేకపోతున్నారు. ఇక భారత్ విషయానికొస్తే, భువనేశ్వర్ కుమార్, మహ్మద్ షమీ మెరుగైన ఫలితాలు రాబడుతున్నారు. దీంతో, భారత్ కే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.