: పెరుగుతున్న ముషారఫ్ తల వెల
పాక్ మాజీ సైనిక పాలకుడు పర్వేజ్ ముషారఫ్ తలకు ఎప్పటికప్పుడు వెల పెరుగుతూ వస్తోంది. 2006లో ముషారఫ్ హయాంలో చేపట్టిన సైనిక చర్యలో బలూచ్ జాతీయ నేత అక్బర్‌ఖాన్ బుగ్టీ మరణించారు. తన తండ్రి మరణానికి కారకుడైన ముషారఫ్‌ను హత్య చేసినవారికి రూ.1 బిలియన్ నగదును, వంద ఎకరాల వ్యవసాయ భూమిని కానుకగా ఇస్తానని అక్బర్‌ఖాన్ కుమారుడు తలాల్ అక్బర్ బుగ్టీ 2000 సంవత్సరంలో అక్టోబరు 9న ప్రకటించారు. ఇప్పుడు ఆ మొత్తాన్ని రెంట్టింపు చేస్తున్నారు.
ముషారఫ్‌ను చంపిన వ్యక్తికి రూ.రెండు బిలియన్ల నగదును, 200 ఎకరాల వ్యవసాయ భూమిని కానుకగా ఇస్తానని ప్రకటించారు. అక్బర్ ఖాన్ నాలుగో కుమారుడు, జమ్హూరీ వతాన్ పార్టీ అధినేత తలాల్ అక్బర్ బుగ్టీ చెబుతున్నారు. మంగళవారం నాడు రావల్పిండిలోని పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ నేత నివాసంలో ఆయన విలేకరుల సమక్షంలో ఈ విధంగా ప్రకటన చేశారు.
గతంలో ముషారఫ్ తలకు పెట్టిన వెలను ఇప్పుడు రెట్టింపు చేస్తున్నానని, ముషారఫ్ మానవత్వంపైనే ఘోరమైన దాడి చేశారని, అందుకే తాను అతని తలకు ఇలాంటి బహుమతిని ప్రకటిస్తున్నట్టు తలాల్ చెబుతున్నారు. మరోవైపు గత ఏడాది అక్బర్‌ఖాన్ బుగ్టీ మనవడు ఒకరు ముషారఫ్ తలపై రూ.10.1 కోట్ల వెల ప్రకటించారు. మొత్తానికి బుగ్టీ హత్యకేసులో నిందితుడిగా ఉన్న ముషారఫ్ ప్రస్తుతం బెయిలుపై జైలు బయట ఉన్నారు.