: మొరాయించిన ఈవీఎం.. గంట నిరీక్షించిన అబ్దుల్ కలాం
ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో ఈవీఎంలు మొరాయించాయి. దీంతో సాక్షాత్తూ మాజీ రాష్ట్రపతి గంటసేపు ఎదురు చూడాల్సి వచ్చింది. ఢిల్లీలోని కె.కామరాజ్ మార్గ్ పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకునేందుకు మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం వచ్చారు. ఓటు హక్కు వినియోగించుకునే సమయానికి సాంకేతిక సమస్యతో ఈవీఎం పని చేయట్లేదని, ఈవీఎం మారుస్తున్నామని అధికారులు తెలిపారు. దీంతో ఆయన మరో ఈవీఎం వచ్చేంత వరకు ఓపిగ్గా ఎదురు చూసి ఓటుహక్కు వినియోగించుకున్నారు. ఇంత సుదీర్ఘ సమయం పట్టేలా ఉంటే కలాం ఇంటికి వెళ్లి వచ్చేవారు కదా? అని ఓ అధికారి కామెంట్ చేశారు. ఇదే పోలింగ్ బూత్ లో చాలా మంది సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, ఆర్మీ, నేవీ దళాల అధిపతులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. సగం ఓటింగ్ జరిగేసరికి 112 ఈవీఎంలను మార్చినట్టు ఎన్నికల అధికారులు తెలిపారు.