: కసితో భార్యను ముక్కలు చేసి ఫ్రిజ్ లో పెట్టాడు
మనుషుల్లో నేరప్రవృత్తి పెరిగిపోతోంది. రోజురోజుకీ నేరాల తీవ్రతతో పాటు నేరాలు జరుగుతున్న తీరు కూడా అత్యంత జుగుప్సాకరంగా మారుతోంది. తాజాగా ముంబైలో ఓ క్రూరుడు అగ్ని సాక్షిగా కట్టుకున్న భార్యను కసిగా పొడిచి చంపి.. మూడు ముక్కలుగా నరికి ఫ్రిజ్ లో పెట్టిన ఘటన కలకలం రేపుతోంది. ముంబైలోని భయాందర్ ప్రాంతంలోని నక్షత్ర అపార్టుమెంట్ 14వ అంతస్థులో నివాసం ఉండే గిరీష్ కోటే(27) అనే వ్యక్తి... తన భార్య మధుబంతిని చాకుతో పొడిచి చంపాడు. అయినా కసి తీరకపోవడంతో ఆ శవాన్ని మూడు ముక్కలుగా నరికి, ప్లాస్టిక్ కవర్లలో చుట్టేశాడు. అందులో రెండు భాగాలను ఫ్రిజ్ లో దాచి పెట్టి, మూడో భాగాన్ని బెడ్ రూంలో దాచిపెట్టాడు.
తరువాత తనకు తెలిసిన ఆటో డ్రైవర్ ను పిలిచి విషయం చెప్పి వాటిని బయటపడేసేందుకు సహకరించాలని కోరాడు. దీంతో భయబ్రాంతులకు గురైన ఆటో డ్రైవర్ నేరుగా పోలీస్ స్టేషన్ కు వెళ్లి విషయం వివరించాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు మృతదేహం ముక్కలు స్వాధీనం చేసుకుని, అతనిని అదుపులోకి తీసుకుని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వారి రెండేళ్ల బాబు తన నాన్నమ్మ వద్ద ఉంటున్నాడు.