: అంత అవసరమైతే ప్రత్యేక రాయలసీమను ఏర్పాటు చేయండి: ఎర్రబెల్లి
రాయల తెలంగాణ పేరుతో కాంగ్రెస్ అధిష్ఠానం మోసం చేస్తోందని తెలంగాణ టీడీపీ నేత ఎర్రబెల్లి దయాకరరావు విమర్శించారు. 10 జిల్లాల తెలంగాణకు రాష్ట్రంలోని అన్ని పార్టీలు ఇదివరకే తీర్మానం చేశాయని గుర్తుచేశారు. ఈ రోజు వరంగల్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. రాయల తెలంగాణ ప్రతిపాదనను తెలుగుదేశం పార్టీ వ్యతిరేకిస్తుందని స్పష్టం చేశారు. రాయల తెలంగాణ ప్రతిపాదనను వ్యతిరేకించడానికి అవసరమైతే మరోసారి ఢిల్లీ వెళ్తామని ఎర్రబెల్లి తెలిపారు. అంత అవసరమైతే ప్రత్యేక రాయలసీమ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని సూచించారు. వేరే జిల్లాలను కలుపుకునేందుకు తెలంగాణ ప్రజలు సిద్ధంగా లేరని అన్నారు.