: నాన్‌వెజ్ కూడా మంచిదేనట
మన ఆరోగ్యానికి ఉపకరించే పలు రకాల విటమిన్లు మాంసాహారంలో కూడా లభిస్తాయి. ముఖ్యంగా, మెదడు చక్కగా అభివృద్ధి చెందాలంటే మాంసాహారం, గుడ్లు, పాలు వంటివి తప్పనిసరిగా తీసుకోవాలని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మాంట్రియల్ యూనివర్సిటీ, సెయింట్ జస్టిన్ ఆసుపత్రికి చెందిన శాస్త్రవేత్తలు సంయుక్తంగా నిర్వహించిన పరిశోధనల్లో మెదడులోని కణాల పనితీరును మాంసాహారంలోని ఒక రకమైన అమైనోఆమ్లం ప్రభావితం చేస్తుందని తేలింది.
మాంసం, గుడ్లు, పాలు వంటి పదార్ధాల్లో ఆస్పరాజైన్ అనే అమైనో ఆమ్లం ఉంటుందని, ఇది మెదడు అభివృద్ధికి చాలా అవసరమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. శరీరం ఈ ఆమ్లాన్ని తనకు తానుగా తయారుచేసుకుంటుందని, దీనికోసం ప్రత్యేకంగా ఆహారాన్ని తీసుకోవాల్సిన అవసరం లేదని ఇంతకాలం శాస్త్రవేత్తలు భావించేవారు.
అయితే ఇప్పుడు శాస్త్రవేత్తలు నిర్వహించిన పరిశోధనల్లో శరీర కణాలకు ఈ ఆమ్లం ఆహారం ద్వారా అందుతుందని తేలింది. 'శరీర కణాలకు ఈ ఆమ్లం ఆహారం ద్వారా అందుతుంది. కానీ మెదడుకు సరఫరా అయ్యే రక్తం ఈ ఆమ్లాన్ని తీసుకెళ్లలేదని' సీనియర్ పరిశోధకులు డాక్టర్ జాక్వెస్ మిచౌద్ చెబుతున్నారు. ఆరోగ్యవంతుని మెదడులో ఆస్పరాజైన్ సమ్మేళనం సరిగ్గా ఉంటోందని, కానీ వైకల్యం ఉన్నవారిలో ఈ ఆమ్లం ఉత్పత్తి తగినంతగా ఉండడం లేదని ఆయన తెలిపారు. మెదడు అభివృద్ధిచెందే సమయంలో ఆస్పరాజైన్ కొరత మెదడు కణాలపై ప్రభావాన్ని చూపిస్తోందని మిచౌద్ చెబుతున్నారు. కాబట్టి మీరు మాంసాహారులైతే కనుక, నిరభ్యంతరంగా మాంసాహారాన్ని లాగించేయండి మరి!