: మూలకణాలతో బోలెడన్ని ఉపయోగాలు
మూలకణాలతో మన శరీరానికి బోలెడు చికిత్సలు చేయవచ్చు. పాడైపోయిన పలు అవయవాలను బాగు చేయవచ్చు. ఇప్పటికే మూలకణాలతో గుండె, క్లోమము, ప్రేగులు, కాలేయము, నాడీవ్యవస్థకు సంబంధించిన కణజాలాన్ని మూలకణాల ద్వారా శాస్త్రవేత్తలు తిరిగి తయారుచేశారు. ఇప్పుడు మూలకణాలనుండి ఊపిరితిత్తులకు సంబంధించిన కణజాలాన్ని శాస్త్రవేత్తలు తయారుచేశారు. ఈ ఊపిరితిత్తులు చక్కగా పనిచేస్తున్నాయని చెబుతున్నారు.
కొలంబియా విశ్వవిద్యాలయ మెడికల్ సెంటర్‌కు చెందిన పరిశోధకులు తమ పరిశోధనల్లో భాగంగా మనిషి మూలకణాలతో చక్కగా పనిచేయగలిగే ఊపిరితిత్తుల కణాలను మార్పిడి చేయడంలో విజయం సాధించారు. ఈ పరిశోధనా ఫలితం ఊపిరితిత్తులకు సంబంధించిన అనేక సమస్యలకు చక్కని పరిష్కారమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఊపిరితిత్తుల పెరుగుదల, అలాగే ఊపిరితిత్తులకు పలు జబ్బులు సంక్రమించినప్పుడు, పాడైపోయిన ఊపిరితిత్తుల స్థానంలో కొత్తవాటి మార్పిడి వంటి సమస్యలన్నింటికీ ఈ కణాలే పరిష్కారమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మూలకణాలనుండి తయారుచేసిన కణజాలంతోనే ఊపిరితిత్తుల మార్పిడి సాధ్యమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.