: ఇది కూడా వారసత్వంగా వస్తుందట!
వారసత్వంగా ఏం వస్తాయి... ఏవో ఆస్తులు, గట్రా వస్తాయి. కాదంటే కొన్ని రోగాలు వస్తాయి. కానీ మనందరికీ పరిచయమైన ఒక గుణం కూడా వారసత్వంగానే వస్తుందట. అదే భయం! కొందరికి కొన్నింటిని చూస్తే భయం. అలాంటి వాటిని చూస్తే కొందరికి భయం వేయదు. ఈ విషయంపై పరిశోధన నిర్వహించిన పరిశోధకులకు తల్లిదండ్రులకు ఉండే భయాలు, ఆందోళనలు వారి పిల్లలకు, వారి మనవలకు ఇలా వారసత్వంగా సంక్రమిస్తాయని తేలింది.
జార్జియాలోని ఒక విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు నిర్వహించిన అధ్యయనంలో భయాలు, ఆందోళనలు అనేవి వారసత్వంగా సంక్రమిస్తాయని తేలింది. కొందరికి ఎత్తైన ప్రదేశాలకు వెళ్లాలంటే భయం, అలాగే కొందరికి నీళ్లంటే భయం. ఇలాంటి వాటి గురించి ఎలుకలపై నిర్వహించిన ప్రయోగాల్లో భయాలు అనేవి తప్పనిసరిగా జన్యుపరంగా తరాలనుండి తరుముకుని వస్తుంటాయని పరిశోధకులు గుర్తించారు. రకరకాల పరిమళాలు, సబ్బుల్లో వాడే ఒక రసాయనాన్ని వాసన చూడగానే భయం కలిగే పరిస్థితులను కొన్ని ఎలుకలకు కల్పించారు. ఆ పరిమళం వాసన చూసినప్పుడల్లా ఎలుకల కాళ్లకు షాక్ తగిలేలా ఏర్పాటు చేశారు. ఇలా కొద్దిరోజులు చేసిన తర్వాత వాటిని సాధారణ ఎలుకలతో కలిసేలా చేశారు. తర్వాత వాటికి పుట్టిన పిల్లల్లో అదే వాసన చూడగానే ఒకరకమైన భయం స్పష్టంగా గోచరించిందని పరిశోధకులు చెబుతున్నారు. కాబట్టి చక్కగా ధైర్యంగా ఉండండి... మీ తరాలకు ధైర్యాన్ని వారసత్వంగా అందించండి.