: ఫైనల్స్ కి దూసుకువచ్చిన తెలుగు వారియర్స్
తెలుగు హీరోలు బాక్సాఫీసు దగ్గరే కాకుండా క్రికెట్ మైదానంలో కూడా దుమ్మురేపుతున్నారు. వెంకటేష్ నేతృత్వంలోని తెలుగు సినీతారల క్రికెట్ జట్టు 'తెలుగు వారియర్స్' నిన్న రాత్రి హైదరాబాదు ఉప్పల్ స్టేడియంలో జరిగిన సెకండ్ సెమీ ఫైనల్స్ మ్యాచ్ లో 'వీర్ మరాఠీ' జట్టును మట్టికరిపించి, ఘనవిజయం సాధించింది. మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న వారియర్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 154 పరుగులు చేశారు.
అనంతరం 155 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగుకి దిగిన మరాఠీ ఆటగాళ్ళు వెంటవెంటనే పెవిలియన్ బాట పట్టారు. 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 79 పరుగులు మాత్రమే చేయగలిగారు. దాంతో, 75 పరుగుల భారీ తేడాతో విజయం సాధించిన వారియర్స్ ఫైనల్స్ కి దూసుకుపోయారు. ఫైనల్ మ్యాచ్ లో కర్నాటక బుల్ డోజర్స్ జట్టుతో వారియర్స్ తలపడతారు.