: కదులుతున్న రైల్లోంచి కూతుర్ని విసిరేసిన తల్లి
అనుబంధాలు అడుగంటిపోతున్నాయి. అత్తింటి ఆరళ్లు భరించలేక ఆ నరకంలో తన కుమార్తె బ్రతుకీడ్చకూడదనుకుందో కన్న తల్లి. కన్న బంధాన్ని కూడా తెంచేసుకుని కదులుతున్న రైళ్లోంచి కుమార్తెను విసిరేసింది. పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్ కతాకు 40 కిలో మీటర్ల దూరంలోని 24 పరగణాల జిల్లాలో నైహాతి రైల్వే స్టేషన్ నుంచి రైలు వేగం అందుకోగానే తన ఒడిలో ఏడాది వయసున్న పసి పాపను పూర్ణమాదాస్ అనే ప్రయాణీకురాలు బయటకు విసిరేసింది.
దీంతో షాక్ తిన్న ప్రయాణీకులు చైన్ లాగి రైలు ఆపి గాయాలపాలైన పాపను రక్షించి ఆసుపత్రికి తరలించారు. పాప పరిస్థితి విషమంగా ఉంది. కాగా ఆడపిల్ల పుట్టిందన్న కారణంతో తనపై శారీరక, మానసిక వేధింపులకు అత్తవారి కుటుంబం పాల్పడుతుండడంతో పసిబిడ్డను వదిలించుకోవాలనుకున్నానని మహిళ వాపోయింది. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.