: రేపటి నుంచి చెన్నైలో రెండు గంటలపాటు పవర్ కట్
తమిళనాడు రాజధాని చెన్నై నగరంలో విద్యుత్ కష్టాలు మొదలు కానున్నాయి. రాష్ట్రంలోని పలు విద్యుత్ కేంద్రాలలో ఉత్పత్తి తగ్గిపోవడంతో ఈ సమస్య నెలకొంది. మంగళవారం నుంచి నగరంలో రోజుకి రెండు గంటల పాటు తప్పనిసరి విద్యుత్ కోతలను అమలు చేస్తున్నట్లు తమిళనాడు పవర్ జనరేషన్ అండ్ డ్రిస్టిబ్యూషన్ కంపెనీ వెల్లడించింది. రాష్ట్రం మొత్తం మీద 2వేల నుంచి 4వేల మెగావాట్ల విద్యుత్ కొరత నెలకొంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని కేంద్ర విద్యుదుత్పత్తి సంస్థల పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ సీఎం జయలలిత ప్రధాని మన్మోహన్ సింగ్ కు లేఖ రాశారు. కేంద్రం నుంచి మరింత విద్యుత్ ను రాష్ట్రానికి సరఫరా చేయాలన్న తన డిమాండ్ ను పట్టించుకోవడం లేదన్నారు. విద్యుత్ కోతలు ఈ నెలంతా ఉండవచ్చని అధికారుల అంచనా.