: మరీ ముదిరితే మతిమరుపు వస్తుందట
కొన్ని వ్యాధులు ముదిరితే మరో కొత్త వ్యాధికి దారితీస్తాయి. ఇలాంటి వాటిల్లో మధుమేహం ఒకటి. ఇందులో టైప్-2 మధుమేహం ముదిరితే అది అల్జీమర్స్ (మతిమరుపు సంబంధ వ్యాధి)కు దారితీస్తుందని శాస్త్రవేత్తలు తాజా అధ్యయనంలో కనుగొన్నారు.
అల్జీమర్స్ బారిన పడుతున్న వారిలో 70 శాతం మంది టైప్-2 మధుమేహం వ్యాధిగ్రస్తులుగా ఉండడంతో ఈ రెండు వ్యాధుల మధ్య ఉన్న సంబంధాన్ని కనుగొనేందుకు శాస్త్రవేత్తలు పరిశోధనలు జరిపారు. వీరి పరిశోధనల్లో టైప్-2 మధుమేహం ముదిరితే అది అల్జీమర్స్‌కు దారితీస్తుందని తేలింది. అయితే ఈ ప్రమాదాన్ని తొలి దశలోనే గుర్తించి సరైన వ్యాయామం చేస్తూ, బరువును తగ్గించుకుంటే అల్జీమర్స్‌కు దూరంగా ఉండవచ్చని వైద్యులు సూచిస్తున్నారు. టైప్-2 మధుమేహంతో బాధపడుతున్నవారి దేహంలో అధికంగా ఉత్పత్తి అయ్యే ఇన్సులిన్ మెదడు కణాలపై చెడు ప్రభావం చూపుతుందని, దీంతో కొంత కాలానికి మెదడు కణాలు పూర్తిగా దెబ్బతినడంతో అల్జీమర్స్ వస్తుందని పరిశోధకులు చెబుతున్నారు. కాబట్టి టైప్-2 మధుమేహంతో బాధపడేవారు తొలిదశలోనే ప్రమాదాన్ని గుర్తించి తగు జాగ్రత్తలు తీసుకుంటే మంచిదని వైద్యులు చెబుతున్నారు.