: పైసాతో పూర్తి ఆనందం రాదు
పైసాలో పరమాత్మ ఉంది అనుకునేవారు చాలామంది మనకు తారసపడుతుంటారు. డబ్బు సంపాదించడంలో ఆనందం ఉందని వాదించేవారు ఎక్కువే. కానీ అది సంపూర్ణ ఆనందం కాదట. కొంత స్థాయి వరకే ఆనందాన్ని డబ్బు ఇస్తుందట. ఎక్కువ డబ్బు సంపాదించిన వారు కూడా తమకు మనశ్శాంతి లేకుండా ఉందంటుంటారు. డబ్బు సంపాదన అనేది కొంత వరకు మాత్రమే ఆనందాన్ని ఇస్తుందని, కానీ అన్నింటినీ డబ్బుతో సొంతం చేసుకోలేమని పెద్దలు చెబుతుంటారు. ఈ విషయంలో ప్రత్యేక అధ్యయనం చేసిన శాస్త్రవేత్తలు డబ్బుతో ఒక స్థాయి వరకూ ఆనందాన్ని పొందవచ్చని తమ అధ్యయనంలో గుర్తించారు.
యూనివర్సిటీ ఆఫ్ వార్విక్ అండ్ ఆల్డో రస్టిచిని, యూనివర్సిటీ ఆఫ్ మినెసోటాకు చెందిన ఆర్ధిక వేత్తలు డబ్బుతో ఒక స్థాయి వరకూ ఆనందాన్ని పొందవచ్చని చెబుతున్నారు. ప్రపంచంలో ఏ పని చేయాలన్నా డబ్బు అవసరం అని, కానీ కొన్నింటిని మాత్రం డబ్బుతో సంపాదించలేమని వీరు చెబుతున్నారు. వ్యక్తి ఆదాయం అనేది 36 వేల డాలర్లు అంటే మన రూపాయిల్లో రూ.22,68,000 వరకూ ఉంటే డబ్బుతో పొందే ఆనందం సాధ్యమేనని వీరి అధ్యయనంలో తేలిందట. అయినా డబ్బుతో ఎంత ఆనందాన్ని పొందినా కొన్ని బంధాల్లో డబ్బుతో కొనలేని ఆనందాన్ని మనం పొందుతామనే విషయం మనకు మాత్రమే అర్థమవుతుంది.