: డిసెంబర్ 21న విశాఖలో సినీ తారల క్రికెట్.. ప్రవేశం ఉచితం
విశాఖలోని వీసీఏ-వీడీసీఏ క్రికెట్ స్టేడియం డిసెంబర్ 21న మరో క్రికెట్ సంబరానికి వేదిక కానుంది. భారత్, విండీస్ జట్లు సాగరతీర వాసులను సంబరంలో ముంచెత్తిన కొద్ది రోజుల్లోనే టాలీవుడ్ జట్టు బాలీవుడ్ జట్టుతో పోటీ పడనుంది. టీఎస్సార్ సీసీ కప్ పేరిట నిర్వహించనున్న ఈ మ్యాచ్ లో టాలీవుడ్ జట్టుకు శ్రీకాంత్ సారధ్యం వహిస్తుండగా, బాలీవుడ్ జట్టుకు సునీల్ శెట్టి కెప్టెన్ గా వ్యవహరించనున్నారు. ఈ డే నైట్ మ్యాచ్ సాయంత్రం 3 గంటలకు ఆరంభం కానుంది.
టాలీవుడ్ జట్టులో శ్రీకాంత్, అల్లరి నరేష్, నాని, ప్రిన్స్, ఆదర్శ్ బాలకృష్ణ , రాజీవ్, రఘు, ప్రభు, అయ్యప్ప, ఖయ్యూం, నిఖిల్ ఉండగా... బాలీవుడ్ జట్టులో సునీల్ శెట్టి, రితేష్ దేశ్ ముఖ్, సోనూ సూద్, రణ్ దీప్, మహేష్ మంజ్రేకర్, మకరంద్, సన్నీ, మనోజ్, షబ్బీర్, రాజా లు ఉన్నారు. కేవలం నగర యువతను ఆహ్లాదపరిచేందుకు నిర్వహించే ఈ మ్యాచ్ వీక్షణకు ఎవరైనా రావచ్చని టి సుబ్బిరామిరెడ్డి తెలిపారు. ఈ మ్యాచ్ లో మరింత మంది సినీ తారలు సందడి చేయనున్నారని నిర్వాహకులు తెలిపారు.