: మూల కణాల్లాంటి వాటివల్లే మళ్లీ క్యాన్సర్ వస్తోందట!
ఇప్పుడు మూల కణాలతో చికిత్స ఎక్కువగా జరుగుతోంది. మూలకణాలతో పలు అవయవాలను తయారుచేయవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. ఇలాంటి మూలకణాల లక్షణాలతో కూడిన క్యాన్సర్ కణాల వల్లే ఈ వ్యాధి తిరగబెడుతోందని పరిశోధకులు చెబుతున్నారు. రొమ్ము క్యాన్సరులో కొన్ని రకాల క్యాన్సర్ కణాలు చికిత్సకు అప్పటికి తగ్గినట్టుగా ఉండి మళ్లీ కోలుకుని వ్యాధి తిరగబెట్టడానికి తోడ్పడతాయి. దీనికి కారణం ఏంటా అని అధ్యయనం చేసిన శాస్త్రవేత్తలు కొన్ని క్యాన్సర్ కణాలు కీమోథెరపీని సైతం తట్టుకుని బతకడానికి కారణాలను గుర్తించారు. మూల కణాల లక్షణాలతో కూడిన స్వల్ప సంఖ్యలో ఉండే కొన్ని క్యాన్సర్ కణాలు వ్యాధి తిరగబెట్టడానికి కారణమవుతున్నాయని శాస్త్రవేత్తలు గుర్తించారు.
ఉత్తర కరోలినా విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు కొన్ని రొమ్ము క్యాన్సర్ కణాలు కీమోథెరపీని సైతం తట్టుకుని బతకడాన్ని గుర్తించారు. ఎంగ్రెయిల్డ్-1 అనే ప్రోటీను రొమ్ము క్యాన్సర్లలో ఉపవిభాగమైన బేసల్-లైక్ రొమ్ము క్యాన్సరులో అతిగా వ్యక్తీకరణ చెందుతున్నట్టు ఈ పరిశోధనలో పాల్గొన్న పరిశోధకులు అడ్రియానా బెల్‌ట్రాన్ చెబుతున్నారు. బేసల్‌లైక్ రొమ్ము క్యాన్సర్‌తో బాధపడే రోగులు ప్రారంభదశలో కీమోథెరపీకి బాగా స్పందిస్తారు, కానీ వారిలో ఆ తర్వాత జబ్బు అతి తీవ్రంగా తిరగబెడుతుందని, మూలకణాల లక్షణాలతో కూడిన స్వల్ప సంఖ్యలో ఉండే కొన్ని క్యాన్సర్ కణాలు వ్యాధి తిరగబెట్టడానికి దోహదపడుతున్నట్టు తాము భావిస్తున్నామని బెల్‌ట్రాన్ చెబుతున్నారు.
ఇలాంటి కణాల్లోనే తాము అతిగా వ్యక్తీకరణవుతున్న ఎంగ్రెయిల్డ్-1 ప్రోటీన్‌ను గుర్తించినట్టు, ఇవి బేసల్‌లైక్ రొమ్ము క్యాన్సర్లలోనే ఉంటున్నట్టు బెల్‌ట్రాన్ చెబుతున్నారు. ఈ ప్రోటీన్‌ను మూసివేసినందున బేసల్‌లైక్ క్యాన్సర్ కణుతులను హతమార్చేందుకు అవసరమైన అమైనో ఆమ్లాల గొలుసును కూడా ప్రయోగశాలలో డిజైన్ చేశారు.