: చక్కెరవ్యాధిపై పోరాటానికి వసీం అక్రంకు అవార్డు!
సుదీర్ఘకాలం పాటు చక్కెర వ్యాధిపై పోరాడి విజయం సాధించినందుకు గాను పాకిస్తాన్‌కు చెందిన ఒకనాటి సుప్రసిద్ధ పేస్‌బౌలర్ వసీం అక్రంకు ప్రత్యేకమైన పురస్కారం అందించాలని అంతర్జాతీయ డయాబెటిస్ ఫౌండేషన్ నిర్ణయించింది. ఆస్ట్రేలియాలో జరిగే ఒక కార్యక్రమంలో 47 ఏళ్ల వసీంకు చక్కెర వ్యాధితో పోరాడుతున్నందుకు గాను.. క్రీడావిభాగంలో యంగ్ లీడర్ అవార్డును అందజేస్తారు. మెల్‌బోర్న్‌లో జరిగే ఓ కార్యక్రమంలో దీన్ని అందజేస్తారు.
టెస్టుల్లో 414, వన్డేల్లో 502 వికెట్లు తీసుకున్న, పాకిస్తాన్‌కు చెందిన ఈ అద్భుతమైన పేస్‌బౌలర్ వసీం అక్రం 1997 నుంచి డయాబెటిస్‌తో పోరాడుతున్నాడు. డయాబెటిస్ గురించి ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు ఇంకా చాలా అవగాహన కలిగించాల్సిన, ప్రచారం చేయాల్సిన అవసరం ఉన్నదని వసీం చెబుతున్నాడు. ఈ వ్యాధితో పోరాడడం ఎలాగో తాను శిక్షణ కూడా ఇస్తానంటున్నాడు.
అన్నట్టు వసీం అక్రం ఇపుడు ఆస్ట్రేలియాకు అల్లుడు కూడా! తన తొలిభార్య మరణించాక ఆయన ఆస్ట్రేలియాకు చెందిన షానియెరా థాంప్సన్ ను పెళ్లిచేసుకున్నాడు.