: బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ తీర్పుపై చంద్రబాబు అసంతృప్తి
కృష్ణా జలాల వినియోగంపై బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ తీర్పుపై టీడీపీ అధినేత చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. తీర్పుతో రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంచుకోవడానికి ట్రైబ్యునల్ అనుమతివ్వడం దారుణమన్నారు. తమ హయాంలో ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంచకుండా అడ్డుకున్నామని తెలిపారు. హైదరాబాదులోని తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బాబు మాట్లాడుతూ.. తాజా తీర్పుతో మిగులు జలాలతో రాష్ట్రంలో చేపట్టిన ప్రాజెక్టులు వృథాగా మారనున్నాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అసమర్ధతతో మిగులు జలాలపై రాష్ట్రం హక్కు కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం నియమించిన న్యాయవాదులు ట్రైబ్యునల్ ఎదుట తమ వాదనలను సరిగ్గా వినిపించలేదని, నీటి లభ్యతను ట్రైబ్యునల్ 65 శాతంగా పరిగణలోకి తీసుకోవడం దారుణమన్నారు.