: కడుపు మండితే ఏమైనా మాట్లాడుతాం: ఏరాసు
కడుపు మండితే ఏమైనా మాట్లాడతామని.. ఎవరిపై చర్యలు తీసుకుంటారని మంత్రి ఏరాసు ప్రతాపరెడ్డి ప్రశ్నించారు. హైదరాబాద్ లో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్, పీసీసీ చీఫ్ బొత్స సహా మంత్రులుగా తామంతా మాట్లాడామని తెలిపారు. రాష్ట్ర విభజనలో సంప్రదాయాలను పాటించాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు. విభజనకు అసెంబ్లీ తీర్మానం కోరాలని డిమాండ్ చేశారు.
శీతాకాల సమావేశాల్లో పార్లమెంటుకు తెలంగాణ బిల్లు రాదన్న ఆశాభావం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ ను హడావుడిగా విభజించాలని చూస్తే మరింత తీవ్ర సమస్యలు ఉత్పన్నమవుతాయని ఏరాసు సూచించారు. రాష్ట్రాన్ని విభజించి తెలుగు ప్రజలు కొట్టుకోవాలని చూస్తున్నట్టు కేంద్రం వైఖరి ఉందని అన్నారు. శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టు సమస్యలు పరిష్కరించకపోతే భవిష్యత్తులో సమస్యలు తలెత్తుతాయని పేర్కొన్నారు. సీమాంధ్రులను సంతృప్తిపరచకుండా విభజించడం మంచిది కాదని ఆయన అన్నారు.