: దర్శకుడు రోహిత్ శెట్టికి గోవా ప్రభుత్వం సన్మానం
బాలీవుడ్ దర్శకుడు రోహిత్ శెట్టిని గోవా ప్రభుత్వం ఈ రోజు ఘనంగా సత్కరించనుంది. ప్రస్తుతం గోవాలో 'అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్' ఘనంగా జరుగుతోంది. ఈ కార్యక్రమంలోనే రోహిత్ ను సన్మానించనుంది. ఈ మేరకు కొన్ని రోజుల కిందటే గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ స్వయంగా శెట్టీకి ఫోన్ చేసి ఆహ్వానించారు. మళ్లీ కొన్ని రోజులకి గోవా ప్రభుత్వం అధికారికంగా ఓ ఆహ్వాన లేఖ పంపినట్లు దర్శకుడి సన్నిహితుడొకరు తెలిపారు. ఈ నేపథ్యంలో శెట్టి ఈ రోజు గోవా వెళ్లనున్నారు. ఎప్పుడూ కామెడీ చిత్రాలు రూపొందించే రోహిత్ శెట్టి.. హీరో అజయ్ దేవ్ గణ్ తో తీసిన 'సింగమ్' (2011), షారుక్ ఖాన్ తో ఇటీవల తెరకెక్కించిన 'చెన్నై ఎక్స్ ప్రెస్' చిత్రాల్లో ఎక్కువగా గోవా లోకేషన్లే ఉంటాయి. అందునా అందంగా ఉండే అక్కడి ప్రదేశాలను మరింత అందంగా తన చిత్రాల్లో చూపించడం ఆయన ప్రత్యేకత.