: పరారీలో 'తెహెల్కా' తేజ్ పాల్
ఢిల్లీలో హైడ్రామా నెలకొంది. సహ ఉద్యోగినిపై లైంగిక దాడికి యత్నించిన తెహెల్కా వ్యవస్థాపకుడు తరుణ్ తేజ్ పాల్ ను అరెస్ట్ చేయడానికి గోవా పోలీసులు ఢిల్లీలోని తేజ్ పాల్ ఇంటికి వెళ్లారు. అయితే, ఈ విషయాన్ని ముందుగానే పసిగట్టిన తేజ్ పాల్ మరో చోటుకు మకాం మార్చారు. దీంతో, గోవా పోలీసులు తేజ్ పాల్ ను పట్టుకోవడానికి అతని బంధువులు, మిత్రుల ఇళ్లలో సోదాలు నిర్వహించారు. అయినప్పటికీ అతని ఆచూకీ ఇంతవరకు దొరకలేదు. తేజ్ పాల్ వివరాలు చెప్పేందుకు అతని సతీమణితో పాటు బంధువులు కూడా నిరాకరిస్తున్నారని గోవా పోలీసులు తెలిపారు. అయితే, హిమాచల్ ప్రదేశ్ లోని ఇంట్లో తేజ్ పాల్ ఉన్నాడని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ రోజు బెయిల్ రాకపోతే తేజ్ పాల్ పోలీసుల ముందు లొంగిపోయే అవకాశమున్నట్టు తెలుస్తోంది.