: డిసెంబర్ 10 నుంచి అన్నా హజారే నిరాహార దీక్ష
బలమైన లోక్ పాల్ బిల్లు కోసం సామాజిక కార్యకర్త అన్నా హజారే మరోసారి నిరాహార దీక్షకు దిగుతున్నారు. ఈ మేరకు డిసెంబర్ 10 నుంచి మహారాష్ట్రలోని తన స్వగ్రామం రాలేగావ్ సిద్ధిలోని యాదవ్ బాబా ఆలయంలో దీక్ష చేయనున్నారు. పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో బిల్లును తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు హజారే ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ కు లేఖ రాశారు. అవినీతి వ్యతిరేక చట్టాన్ని తీసుకురావటంలో ప్రభుత్వం విఫలమైందని అన్నా అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రధానికి తాను రాసిన లేఖకు సమాధానంగా పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి వి. నారాయణ స్వామి లేఖ పంపారని.. లోక్ పాల్ బిల్లు తెచ్చేందుకు దశలవారీగా సర్కారు ప్రయత్నిస్తోందని మంత్రి పేర్కొన్నట్లు అన్నా తెలిపారు.