: ఏటీఎం సెంటర్లలో ప్యానిక్ అలారం ఉండాల్సిందే: పోలీసులు
హైదరాబాద్ పరిధిలోని ఏటీఎం సెంటర్ల వద్ద చోటు చేసుకుంటున్న చోరీలు, దోపిడీ ఘటనల నేపథ్యంలో, నగర పోలీసు కమిషనర్ అనురాగశర్మ వివిధ బ్యాంకు అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, ఏటీఎం సెంటర్లలో ’ప్యానిక్ అలారం‘ తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని తెలిపారు. దీనివల్ల లోపల ఉన్న వినియోగదారుడికి ఏమైనా జరిగితే, వెంటనే అలారం మోగిస్తాడని, దీంతో అంతా అలర్ట్ అవుతారని చెప్పారు.ఈ సమావేశంలో ఏటీఎంల భద్రతా ఏర్పాట్లను ఆయన సమీక్షించారు. దీంతోపాటు, బ్యాంకర్లకు కొన్ని సూచనలు జారీ చేశారు. ఈ సూచనలను కచ్చితంగా అమలు చేసేందుకు బ్యాంకులకు నెల రోజుల గడువు ఇచ్చామని అన్నారు. అప్పటిలోగా వీటిని బ్యాంకర్లు అమలు చేయకపోతే చట్టప్రకారం తదుపరి చర్యలు తీసుకుంటామని నగర పోలీస్ కమిషనర్ అనురాగశర్మ తెలిపారు.
బ్యాంకర్లకు సూచనలు...
ఏటీఎం ముందు భాగంలో ఉండే అద్దాలు పూర్తి పారదర్శకంగా ఉండాలి. లోపల ఏం జరుగుతోందో బయటి వ్యక్తులకు కనిపించేలా ఏర్పాటు చేయాలి. ఏటీఎం సెంటర్ బయట, లోపల తప్పనిసరిగా సీసీ కెమెరా ఉండాలి. అది పూర్తి క్వాలిటీతో లోపలికి వచ్చే, బయటకు వెళ్లే వారిని చిత్రీకరించే దిశలో ఏర్పాటు చేయాలి. బ్యాంకులతో పాటు, ఏటీఎం సెంటర్లో సెక్యూరిటీ గార్డులు ఉండేలా చర్యలు తీసుకోవాలి. గార్డులకు అవసరమైన శిక్షణ ఇవ్వాలి. ఏటీఎం షట్టర్లు పటిష్టంగా ఉండాలి. సాధారణ వ్యక్తులు ఎప్పడు పడితే అప్పుడు కిందకు లాగే అవకాశం లేకుండా షట్టరు ఏర్పాటు చేయాలి. పబ్లిక్ అడ్రస్ సిస్టం ఏర్పాటు చేసుకుని ఖాతాదారులకు ఎప్పటికప్పుడు సలహాలు, సూచనలు అందిస్తూ అలర్ట్ చేయాలి. పోలీసులు తమ పరిధిలోని బ్యాంకులను రోజూ సందర్శిస్తూ అవసరమైన సహాయ సహకారాలు అందించాలి.