: ఆరుషి హత్య కేసులో హైదరాబాద్ సీడీఎఫ్ డీ పొరపాటు చేసిందా?
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఆరుషి, హేమరాజ్ జంట హత్య కేసులో.. హంతకులు ఆరుషి తల్లిదండ్రులంటూ కోర్టు ముగింపు ఇచ్చింది. కానీ, ఈ కేసుకు సంబంధించి ఒక ప్రధాన అంశం ఇప్పుడు మళ్లీ చర్చనీయాంశం అవుతోంది. ఆరుషి హత్య కేసులో హైదరాబాద్ లోని సెంటర్ ఫర్ డీఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్(సీడీఎఫ్ డీ) ఇచ్చిన నివేదికపై అనుమానాలు ముసురుకుంటున్నాయి.
దీనికి కారణం సీడీఎఫ్ డీ 2008లో ఇచ్చిన తొలి నివేదికలోని కొన్ని వివరాలను మారుస్తూ మళ్లీ 2011 మార్చిలో కొత్త రిపోర్టు ఇవ్వడం.. అందులో కొన్ని వివరాలు మారడంతో రాజేష్, నుపుర్ తల్వార్ దంపతుల తరఫు న్యాయవాది రెబెక్కా జాన్ సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. అలహాబాద్ హైకోర్టులో అప్పీలు సందర్భంగా ఇదే కీలకాంశం కానుంది.
జాన్ తెలిపిన వివరాల ప్రకారం.. సీడీఎఫ్ డీ 2008లో మొదటిసారి ఇచ్చిన నివేదికలో కృష్ణ (రాజేష్ తల్వార్ కాంపౌండర్) గదిలో ఉన్న వంగ పండు రంగు దిండు కవర్ పై హేమరాజ్ రక్తం మరకలు ఉన్నాయని పేర్కొంది. కానీ, 2011లో సవరించిన నివేదికలో కృష్ణ పేరు అచ్చుపరంగా జరిగిన తప్పువల్ల వచ్చిందని పేర్కొంది. అలాగే వంగపండు రంగు దిండు కవర్ హేమరాజ్ గదిలో ఉందని మార్పు చేసింది. దీంతో ఈ నివేదిక చెల్లదని రెబెక్కా అంటున్నారు.