: ఆ రోజు లిఫ్ట్ లో ఏం జరిగింది?
సంచలనం సృష్టించిన తెహల్కా వ్యవస్థాపకుడు తరుణ్ తేజ్ పాల్ కేసులో... గోవా పోలీసుల దర్యాప్తులో ఒక్కో విషయం వెలుగుచూస్తోంది. తేజ్ పాల్ ఓ ఫైవ్ స్టార్ హోటల్ లోని లిఫ్టులో తనపై లైంగిక దాడికి యత్నించారని తెహల్కాలో పనిచేసిన యువ మహిళా జర్నలిస్టు ఆరోపించిన సంగతి తెలిసిందే. దర్యాప్తును ప్రారంభించిన గోవా పోలీసులకు ఆరంభంలోనే పెద్ద షాక్ తగిలింది. ఎందుకంటే లిఫ్ట్ లో కెమెరానే లేదని తేలింది. దీంతో, లిఫ్ట్ బయట ఉన్న కెమెరాల ఫుటేజ్ ను తీసుకుని దాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. ఆ ఫుటేజ్ లో రికార్డయినదాన్ని.. మహిళా జర్నలిస్టు చెప్పిన అంశాలతో గోవా పోలీసులు పోల్చి చూసుకున్నారు. ఈ క్రమంలో వారికి కొన్ని బలమైన సాక్ష్యాలు లభించాయి.
నవంబర్ 7న రాత్రి 9 గంటల సమయంలో మహిళా జర్నలిస్టుతో పాటు తేజ్ పాల్ లిఫ్ట్ లోకి వెళ్లారు. ఆ సమయంలో ఆ మహిళ భుజాల మీద తరుణ్ చేతులు వేసి ఉన్నాడు. మరో గంటన్నర తర్వాత (10.30కి) .. గ్రౌండ్ ఫ్లోర్ లో అదే లిఫ్టు వద్ద తేజ్ పాల్ కనిపించాడు. ఆ సమయంలో అతను మహిళా జర్నలిస్టును బలవంతంగా లిఫ్టులోకి చేత్తో లాగాడు. రెండు నిమిషాల అనంతరం సెకండ్ ఫ్లోర్ లో లిఫ్ట్ ఆగింది. అప్పుడు ఆ జర్నలిస్ట్ తన దుస్తులను సరిజేసుకుంటూ లిఫ్టులోంచి బయటకు వచ్చి... దాదాపు పరుగెడుతున్నట్టు మెట్ల మీద నుంచి కిందకు వెళ్లింది. తేజ్ పాల్ కూడా ఆమెను అనుసరించారు. ఈ వివరాలను బాధిత మహిళా జర్నలిస్టు ఇప్పటికే వెల్లడించింది. ఆమె చెప్పిన దాంతో లిఫ్టు దగ్గర జరిగిన సన్నివేశాలు సరిపోతున్నాయని పోలీసులు అభిప్రాయపడుతున్నారు.