: వ్యాపారి కిడ్నాప్... రూ. కోటి డిమాండ్
ఓ వ్యాపారిని కిడ్నాప్ చేసిన కిడ్నాపర్లు, అతన్ని క్షేమంగా విడుదల చేయాలంటే కోటి రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ ఘటన మహారాష్ట్రలోని థానేలో జరిగింది. థానేలో పలు వ్యాపారాలు చేస్తున్న భగవాన్ లాల్ చంద్ ను కిడ్నాపర్లు కిడ్నాప్ చేశారు. ఈ నెల 24వ తేదీన రాత్రి సమయంలో భగవాన్ కు ఫోన్ రావడంతో బయటకు వెళ్లారని... మళ్లీ ఆయన తిరిగి రాలేదని ఆయన కుటుంబీకులు తెలిపారు. ఆయన రాకకోసం ఎదురుచూస్తున్న తమకు కిడ్నాపర్ల నుంచి ఫోన్ వచ్చిందని చెప్పారు. దీంతో భయభ్రాంతులకు గురైన తాము, వెంటనే పోలీసులకు సమాచారం అందజేశామని తెలిపారు. భగవాన్ కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు థానే పోలీసు ఉన్నతాధికారి ఒకరు ఈ రోజు తెలిపారు.