: ఇక డెబిట్ కార్డులు, క్రెడిట్ కార్డుల లావాదేవీలకు ఆధార్: రిజర్వ్ బ్యాంక్


ఎలక్ట్రానిక్ కార్డులు, డెబిట్ కార్డులు, క్రెడిట్ కార్డుల ఆధారంగా పాయింట్ ఆఫ్ సేల్స్ (పిఒఎస్) టెర్మినల్స్ వద్ద, ఏటిఎంల వద్ద నిర్వహించే లావాదేవీలన్నింటికీ సంపూర్ణ భద్రత కల్పించేందుకు ఆధార్‌ను అదనపు అధీకృత గుర్తింపుగా పరిగణించాలని బ్యాంకులను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆదేశించింది. ఆధార్‌ను అదనపు గుర్తింపుగా పరిగణించాలని లేదా యూరోపే మాస్టర్‌కార్డ్ వీసా(ఇఎంవి) చిప్, పిన్ టెక్నాలజీతో కార్డులు జారీ చేయాలని ఆర్‌బిఐ సూచించింది. కార్డులకు ఇఎంవి నిబంధనలు వర్తింపచేయాలంటూ ఆర్‌బిఐ ప్రత్యేకంగా ఆదేశాలు జారీ చేయని కేసుల్లో ఆధార్‌ను వర్తింపచేయడంపై నిర్ణయం తీసుకునే స్వేచ్ఛ బ్యాంకులకే వదిలివేస్తున్నట్టు రిజర్వ్ బ్యాంక్ తెలిపింది. ఇక ముందు జారీ చేసే కార్డులన్నీ ఇఎంవి చిప్, పిన్ టెక్నాలజీ ఆధారంగానే ఉండాలని లేదంటే ఆధార్‌ను అనుమతించాలని కూడా స్పష్టంగా పేర్కొంది. లావాదేవీలు నిర్వహించే సమయంలో కార్డుహోల్డర్లు పిఒఎస్ వద్ద లేదా ఏటిఎం వద్ద స్వయంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించింది. నకిలీ కార్డులు, చోరీకి గురైన కార్డుల నుంచి కస్టమర్లకు రక్షణ కల్పించేందుకు ఆధార్ గుర్తింపు కోసం యుఐడిఎఐ తీసుకున్న బయోమెట్రిక్ (వేలిముద్ర లేదా రెటీనా స్కాన్) గుర్తింపును అధీకృతమైనదిగా ప్రకటించాలని ఆర్‌బిఐ తాజాగా జారీ చేసిన నోటిఫికేషన్‌లో ఆదేశించింది. బయో మెట్రిక్ తప్పనిసరి చేయడం వల్ల కార్డు చోరులు, నకిలీ కార్డులు చలామణిలోకి తెచ్చే శక్తులు అక్రమంగా లావాదేవీ నిర్వహించడాన్ని నిరోధించవచ్చునని పేర్కొంది. కార్డు, ఎలక్ట్రానిక్ చెల్లింపులకు అదనపు భద్రతలు కల్పించే విషయమై అధ్యయనం చేసేందుకు ఏర్పాటు చేసిన కార్యాచరణ బృందం సిఫారసుల ఆధారంగా ఆర్‌బిఐ ఈ తాజా ఆదేశాలు జారీ చేసింది. ఇఎంవి చిప్‌ల వల్ల నకిలీ కార్డులు తయారుచేయడం సాధ్యం కాదు గనుక కస్టమర్‌కు సంపూర్ణ రక్షణ ఉంటుంది.

  • Loading...

More Telugu News