: బీజేపీ ఎన్నటికీ ప్రజల హృదయాలను గెలవలేదు: సోనియాగాంధీ
బీజేపీ ఎన్నటికీ ప్రజల హృదయాల్లో స్థానం సంపాదించలేదని కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ అభిప్రాయపడ్డారు. రాజస్థాన్ లోని శీతర్ లో ఎన్నికల ప్రచార సభలో ఆమె మాట్లాడుతూ... బీజేపీ అధికారంలో ఉన్నప్పటి పరిస్థితులను, ఇప్పటి పరిస్థితులతో బేరీజు వేసుకోవాలని ప్రజలకు సూచించారు. బీజేపీ అధికారంలో ఉన్నప్పుడు రాజస్థాన్ లో అభివృద్ధి జరగలేదన్నారు. వారు అధికారంలో ఉన్నప్పుడు ప్రజారోగ్యాన్ని సంరక్షించేందుకు ఉచితంగా మందులు పంపిణీ చేశారా? అభివృద్ధి పథకాలు చేపట్టారా? అని ప్రశ్నించారు.
స్వార్థ రాజకీయాలు చేస్తున్న బీజేపీ ప్రజలను తప్పదోవ పట్టిస్తోందని సోనియా మండిపడ్డారు. స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి వెనుకబడిన రాష్ట్రంగా ఉన్న రాజస్థాన్ ను అభివృద్ధి చేసింది కాంగ్రెస్ పార్టీయేనన్నారు. రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లాలంటే మరోసారి కాంగ్రెస్ ను గెలిపించాలని కోరారు. ప్రజా సంక్షేమం కోసం ఆహార భద్రత, ఎంజీఎన్ఆర్ జీఏ లాంటి పథకాలను యూపీఏ ప్రభుత్వం ప్రవేశపెట్టిందని ఆమె గుర్తు చేశారు.