: అసోంలో రాష్ట్రపతి పాలన విధించాలి: బీజేపీ
అసోంలో రాష్ట్రపతి పాలన విధించాలని బీజేపీ డిమాండ్ చేసింది. ప్రజలకు భద్రత, రక్షణ కల్పించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యం చెందిందని... ముఖ్యమంత్రి తరుణ్ గొగోయ్, అటవీ శాఖామంత్రి హుస్సేన్ లు రాజీనామా చేయాలని ఆ పార్టీ డిమాండ్ చేసింది. ఇటీవల అసోంలో అత్యాచార ఘటనలు, కిడ్నాపులు పెరిగిపోయాయని బీజేపీ జాతీయ మహిళా నేత బిజోయా చక్రవర్తి మీడియాతో అన్నారు. నేరాలను అదుపు చేయడంలో సీఎం తరుణ్ గొగోయ్ విఫలమయ్యారని, అలాగే రోజురోజుకూ నేరాలు అధికమవుతూనే ఉన్నాయని బిజోయా చక్రవర్తి వెల్లడించారు.
అలాగే అసోంలోని అటవీ ప్రాంతాల్లో మరణాలు పెరిగిపోయాయని, ఈ విషయంలో అటవీ శాఖామంత్రి హుస్సేన్ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోందని బిజోయా తెలిపారు. ఇకనైనా కేంద్రం ఈ విషయంలో త్వరితగతిన నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ అసమర్థతను ప్రధాని గుర్తించాల్సిన అవసరం ఉందని... ఈ విషయంలో ప్రధాని మన్మోహన్ మౌనం, అస్సాం ప్రజలకు అనర్థం కలిగిస్తోందన్నారు. ఇకనైనా సీఎం, అటవీ మంత్రులను అరెస్టు చేసి, రాష్ట్రపతి పాలన విధించాల్సిన అవసరం ఉందని ఆమె అభిప్రాయపడ్డారు.